సత్తుపల్లి టౌన్, ఏప్రిల్ 20 : సత్తుపల్లి పట్టణం మెడికల్ హబ్‌గా రూపుదిద్దుకుంటున్నది. 100పడకల ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆసుపత్రి అభివృద్ధికి రూ.34 కోట్లు మంజూరు చేయించారు. మంత్రి తన్నీరు హరీశ్‌రావు శంకుస్థాపన సైతం చేశారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు తీవ్రమవుతున్న క్రమంలో 5 డయాలసిస్ మిషన్లకు అదనంగా మరో ఐదు మిషన్లు, రూ.10 కోట్లతో రేడియాలజీ ల్యాబ్‌తో కూడిన డయాగ్నసిస్ టీహబ్‌ను మంత్రి మంజూరు చేశారు.
ఈ 100 పడకల ఆసుపత్రి వినియోగంలోకి వస్తే సుమారు 20మంది వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్యులతోపాటు 120మంది సిబ్బంది సేవలందించనున్నారు. సుదూర వైద్యప్రయాసలకు ఉపశమనం కలుగుతుందని ఈ ప్రాంత వాసులు భావిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న షుగర్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు నిత్యం ప్రైవేట్ రక్తపరీక్షా కేంద్రాల్లో వేలాది రూపాయల ఫీజులు కట్టలేని పరిస్థితికి టీహబ్ ఏర్పాటుతో మోక్షం కలుగనుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయనున్న ఈ డయాగ్నసిస్ కేంద్రంలో అత్యంత వేగంగా, కచ్చితమైన రిపోర్టులు నిరుపేదలకు ఉచితంగా అందనున్నాయి.
డిజిటల్ ఎక్స్‌రే, ఈసీజీ వంటి వాటితో మరెన్నో డయాగ్నసిస్ సేవలు రేడియాలజీ ల్యాబ్ ద్వారా అందుతాయి. 4 నుంచి 5 ఆపరేషన్ థియేటర్లు కూడా ఈ కొత్త ఆసుపత్రి భవనంలో ఏర్పాటుకానున్నాయి. ఇప్పటివరకు ఉన్న బ్లడ్ స్టోరేజికి అదనంగా పూర్తిస్థాయి బ్లడ్ బ్యాంకు ఏర్పాటు కానుంది. ఎటువంటి ఆపరేషన్లు ఐనా స్థానికంగానే అందించేందుకు టీఎస్ ఎంఎస్ఐడీసీ(తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) శరవేగంగా నిర్మాణ పనులు చేస్తున్నది.
మారుతున్న పరిస్థితుల దృష్ట్యా..
నియోజకవర్గ కేంద్రంగా ఉన్న సత్తుపల్లి మండలంలో(మున్సిపాలిటీ సహా) సుమారు 80వేల జనాభా ఉంది. 1976లో అప్పటి అవసరాలకు అనుగుణంగా 30పడకల సాధారణ ఆసుపత్రిని నిర్మించినప్పటికీ మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న జనాభా, వ్యాధుల తీవ్రతతోపాటు వసతులు కరువయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కృషితో కార్పొరేట్ వైద్యసేవలు చేరువయ్యాయి. రోడ్డు ప్ర మాదాలు జరిగినప్పుడు ఖమ్మం, విజయవాడ, హై దరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే. అవసరమైన రక్తం, డయాగ్నసిస్, స్పెషలిస్ట్ డాక్టర్లు, ఐసీయూ వంటి అధునాతన వైద్యసేవలకు ఈ ప్రాంతం నోచుకోలేకపోయింది. అటువంటి ఖరీదైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందనుండడంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
250 పడకలతో మరో ఆసుపత్రి
మండలంలోని నారాయణపురం గ్రామంలో శ్రీషిరిడీసాయి జనమంగళం చారిటబుల్ ట్రస్టు పేరుతో 250 పడకల ఆసుపత్రి కూడా నిర్మిస్తుండడంతో సత్తుపల్లి ప్రాంతం మెడికల్ హబ్‌గా అవతరించనుంది. ఆంధ్రా సరిహద్దు ప్రాంతంగా ఉన్న సత్తుపల్లిలో 100పడకల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు 250 పడకల ట్రస్టు ఆసుపత్రి సేవలు మరో రెండేళ్లలోపు అందుబాటులోకి రానున్నాయి.
కేసీఆర్ సహకారంతో నిర్మాణం
సత్తుపల్లి పట్టణ ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించాను. అదేవిధంగా రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు అడిగిన వెంటనే టీహబ్ రక్తపరీక్షా కేంద్రాన్ని మంజూరు చేయడంతోపాటు డయాలసిస్ పేషెంట్లకు అదనంగా మరో ఐదు డయాలసిస్ మిషన్లు అందించినందుకు కృతజ్ఞతలు.
– సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్యే, సత్తుపల్లి
త్వరలో అందుబాటులోకి వైద్యసేవలు
వంద పడకల ఆసుపత్రి నిర్మాణంతో సత్తుపల్లి ప్రాంతవాసులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుబాటులోకి రానుంది. ఇప్పుడున్న వైద్యుల కంటే మూడు రెట్లు అదనంగా సేవలు అందించనున్నారు. సిబ్బంది సంఖ్య పెరగనుంది. రాబోయే రెండేళ్లలో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి.
– డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్