మామిళ్లగూడెం/ రఘునాథపాలెం, ఏప్రిల్ 20: ఎనిమిదో విడత హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎంవో (హరితహారం) ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఆదేశించారు. నగరంలోని డీపీఆర్సీ సమావేశ మందిరంలో కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి బుధవారం హరితహారంపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏడు విడతల్లో చేపట్టిన హరితహారం కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, ఇదే స్ఫూర్తితో ఎనిమిదో విడతనూ విజయవంతం చేయాలన్నారు. జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో నిలపాలన్నారు. నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలన్నారు. గ్రామాల్లో మొక్కల సంరక్షణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనన్నారు.
పట్టణం, గ్రామం అని తేడా లేకుండా ప్రతి ఊరిలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌పై దృష్టి సారించాలని సూచించారు. మొక్కల సంరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములై కాలుష్య రహిత సమాజం కోసం కృషి చేయాలన్నారు. ప్రతి అధికారి బాధ్యతతో విధులు నిర్వర్తించాలన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటాలన్నారు. పల్లె, పట్టణ ప్రకృతి వనాల్లో విరివిగా మొక్కలు పెంచాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా అటవీశాఖ అధికారి ప్రవీణ, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి విద్యాచందన, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వీవీ అప్పారావు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.
రఘునాథపాలెంలో పర్యటన
ఖమ్మం నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ పనులను సీఎం కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ బుధవారం కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి పరిశీలించారు. రఘునాథపాలెం బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. 14 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనంలో ఇప్పటివరకు 20వేలకు పైగా మొక్కలు నాటినట్లు కలెక్టర్ వివరించారు. డ్రిప్ పద్ధతిన నీటి వసతి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో విరివిగా మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులకు ఓఎస్డీ సూచించారు. బృహత్ పల్లె ప్రకృతి వనంలో ఓఎస్డీ ప్రియాంకవర్గీస్ మొక్క నాటారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్, నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఎఫ్‌వో ప్రవీణ, ఆర్అండ్బీ ఎస్ఈ లక్ష్మణ్, ఈఈ శ్యాంప్రసాద్, తహసీల్దార్ నర్సింహారావు, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీపీ భూక్యా గౌరి, సర్పంచ్ శారద పాల్గొన్నారు.