ఖమ్మం, ఏప్రిల్ 20: కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి కేవలం రాజకీయ లబ్ధికోసమే మంత్రి అజయ్‌కుమార్‌పై ఆరోపణులు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని జడ్పీ, డీసీసీబీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కూరాకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రేణుకాచౌదరి పూర్తిగా రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. మంత్రి పువ్వాడపై కేసులు పెట్టాలనడం అవివేకమని, హైదరాబాద్‌లో పబ్బులు నడుపుతూ డ్రగ్స్ విక్రయిస్తున్న ఆమె కూతురు, అల్లుడిపై ముందు కేసులు పెట్టాలని అన్నారు. జిల్లాలో కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని, బీజేపీ నాయకులు శవ రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు చెప్పారు.
ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పువ్వాడ అజయ్ మంత్రి కాక ముందే సాయిగణేశ్ మీద కేసులున్నాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకుడు ముస్తాఫా మీద కేసులు పెట్టాల్సిన అవసరం మంత్రి లేదని స్పష్టం చేశారు. 2014కి ముందే అతడిపై అనేక కేసులున్నాయని గుర్తుచేశారు. ఇవేమీ తెలుసుకోకుండా మంత్రి అజయ్‌పై రేణుకాచౌదరి వ్యాఖ్యలు చేయడం గర్హనీయమని అన్నారు. ఆమె వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎంపీగా ఉన్నప్పుడు రేణుకాచౌదరి ఖమ్మానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడు ఖమ్మానికి మంత్రి అజయ్ ఏం చేశారో తాము చెబుతామని సవాల్ విసిరారు. అజయ్ గురించి మాట్లాడే అర్హత రేణుకాచౌదరికి లేదని స్పష్టం చేశారు. ఖమ్మం ఆడబిడ్డనని చెప్పుకుంటూ జిల్లా ప్రజలను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, కార్పొరేటర్ కమర్తపు మురళి, టీఆర్ఎస్ నగర అధ్యక్షడు పగడాల నాగరాజు పాల్గొన్నారు.