భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్స్ అన్ని రంగాలతో పాటు విద్యారంగాన్ని కుదిపేసింది. విద్యార్థులను ప్రత్యక్ష తరగతులకు దూరం చేసింది. పరీక్షల నిర్వహణకు వీలులేని పరిస్థితులను సృష్టించింది. 2020 విద్యాసంవత్సరంలో పదోతరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో కేవలం మూడు పరీక్షలు మాత్రమే రాయగలిగారు. ఆ తర్వాత అనివార్యంగా పరీక్షలను నిలిపివేయాల్సి వచ్చింది. 2021లో అసలుఏ పరీక్షల నిర్వహణే చేపట్టలేదు. ఇప్పుడు కొవిడ్ ప్రభావం లేకపోవడంతో రాష్ట్రప్రభుత్వం ఈసారి పది పరీక్షలను నిర్వహించనున్నది. మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షల షెడ్యూలు విడుదల చేసింది. భద్రాద్రి జిల్లా నుంచి ఈసారి 13,419 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. కలెక్టర్ అనుదీప్ ఇప్పటికే పది పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
ఏర్పాట్లు ఇలా..
పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ జిల్లాను 35 జోన్లుగా గుర్తించి మొత్తం 74 పరీక్షా కేంద్రాలను కేటాయించింది. వీటిలో 11 కేంద్రాలు సమస్యాత్మకమైనవని గుర్తించింది. పది పరీక్షల నిర్వహణకు పోలీస్, వైద్యారోగ్యశాఖ, విద్యుత్, పంచాయతీ, ఆర్టీసీ, మున్సిపల్‌శాఖ అధికారుల సహాయ సహకారాలు తీసుకోనున్నది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు కానున్నది. విద్యార్థులు పరీక్షా సమయానికి 30 నిమిషాలు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత బస్ రవాణా సౌకర్యం కల్పించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అత్యవసర సమయాల్లో డీఈవో కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్‌ను 90101 91438 అనే నంబరులో సంప్రదించవచ్చు.
24 నుంచి సెలవులు..
విద్యాసంవత్సరం ఈనెల 23తో ముగియనున్నది. దీంతో ప్రభుత్వం 24 నుంచి సెలవులు ప్రకటించింది. కానీ టెన్త్ ఎగ్జామ్స్ పూర్తి కానందున హైస్కూల్ టీచర్లు వచ్చే నెల 23 వరకు పాఠశాలలకు హాజరుకానున్నారు.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం..
పది పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కలెక్టర్ అనుదీప్ ఇప్పటికే పరీక్షలపై సమీక్షించారు. అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తాం. నిబంధనలను పక్కాగా అమలు చేస్తాం. –సోమశేఖరశర్మ, డీఈవో, భద్రాద్రి కొత్తగూడెం