టేకులపల్లి, ఏప్రిల్ 18:దళితుల్లో శాశ్వత పేదరికాన్ని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘దళితబంధు’ పథకానికి శ్రీకారం చుట్టింది. కూలీలుగా పనిచేసిన వారు యజమానులుగా మారే రోజులు వస్తున్నాయి. వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి మరికొంతమంది ఉపాధికి బాటలు వేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 100 కుటుంబాలను ఎంపిక చేసి వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లా అధికారులు ఈ పథకం అమలుకు కసరత్తు ప్రారంభించారు. మండలాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారికి ఆసక్తి ఉన్న రంగాలను గుర్తిస్తున్నారు. వారు ఎంచుకున్న రంగంలో ఎలాంటి అనుభవం ఉన్నది.. ఇంకా వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలన్న కోణంలో అధికా రులు చొరవ తీసుకుంటున్నారు.
గతంలో ఏ ప్రభుత్వమూ ఎస్సీల జీవన స్థితిగతుల గురించి ఆలోచించలేదు. వారికి ఆర్థిక చేయూతనిచ్చే విధంగా సమగ్రమైన పథకాన్ని అమలు చేయలేదు. వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు సీఎం కేసీఆర్ అద్భుతమైన ఆలోచన చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. తొలివిడతలో ప్రతి నియోజకవర్గానికి 100 కుటుంబాలను ఎంపిక చేసి వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాఅధికారులు పథకం అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. మండలాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారికి ఆసక్తి ఉన్న రంగాలను గుర్తిస్తున్నారు. వారు ఎంచుకున్న రంగంలో ఎలాంటి అనుభవం ఉన్నది.. ఇంకా వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందివ్వాలన్న కోణంలో అధికారులు చొరవ తీసుకుంటున్నారు.
జిల్లాకు 421 యూనిట్లు..
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 412 యూనిట్లు మంజూరు చేసింది. అశ్వారావుపేటకు 31 యూనిట్లు, దమ్మపేట 31, ములకలపల్లి 13, చండ్రుగొండ 12, అన్నపురెడ్డిపల్లి 13, కొత్తగూడెం 57, చుంచుపల్లి ఏడు, లక్ష్మీదేవిపల్లి ఆరు, పాల్వంచ(ఆర్) ఐదు, పాల్వంచ(టి) 19, సుజాతనగర్ ఆరు, పినపాక 13, ఆళ్లపల్లి 10, కరకగూడెం 13, అశ్వాపురం 11, మణుగూరు మున్సిపాలిటీ 22, బూర్గంపహాడ్ 19, గుండాల 12, భద్రాచలం 20, దుమ్ముగూడెం 20, చర్ల 20, టేకులపల్లి 44, జూలూరుపాడు మండలానికి 17 యూనిట్లు మంజూరయ్యాయి
హరిజనవాడకు 44 యూనిట్లు..
మొదటి విడతలో ప్రభుత్వం ఇల్లెందు నియోజకవర్గానికి 100 యూనిట్లు మంజూరు చేయగా ఎమ్మెల్యే హరిప్రియానాయక్ టేకులపల్లి మండలంలోని హరిజనవాడకు 44 యూనిట్లు, మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలానికి 56 యూనిట్లు కేటాయించారు. హరిజనవాడ గ్రామ జనాభా 177. గ్రామంలో మొత్తం 50 ఎస్సీ కుటుంబాలు ఉండగా 44 కుటుంబాలకు పథకం వర్తిస్తున్నది. ఇప్పటికే అధికారులు లబ్ధిదారులకు యూనిట్లపై అవగాహన కల్పించారు. లబ్ధిదారుల ఆసక్తి, అనుభవాలను దృష్టిలో పెట్టుకుని యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయింది. వారం పది రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమకానున్నది.
గొప్ప పథకం..
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. యూనిట్లు నెలకొల్పేందుకు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షలు జమ చేయనున్నారు. పథకం ఎస్సీల జీవన స్థితిగతులను మారుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. టేకులపల్లి మండలంలోని హరిజనవాడకు 44 యూనిట్లు మంజూరయ్యాయి. వారందరికీ అండగా నిలిచి యూనిట్లు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నాం. విడతల వారీగా నియోజకవర్గంలో ఎస్సీలందరికీ పథకం వర్తింపజేస్తాం.
– ఎమ్మెల్యే హరిప్రియానాయక్
కారు కొని ట్రావెల్స్ నడుపుతా..
నేను పదేళ్ల నుంచి డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఉన్నా. దళితబంధు పథకంలో భాగంగా నేను కారు కొని ట్రావెల్స్ నడుపుదామ నుకుంటున్నా. నేను డ్రైవర్‌గానే మిగిలిపోతాను. ఎప్పటికీ యజమానిని కాలేను.. అనే బాధ నన్ను బాధించేది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకంతో కారుకు యజమాని అవుతాననే ఆనందం కలిగింది.
– ఎ.రఘు, లబ్ధిదారుడు, హరిజనవాడ
పేదరికాన్ని జయిస్తా..
నేను కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటాను. నాకు చిన్నప్పటి నుంచి డీజే, డెకరేషన్, షామియానా రంగమంటే ఇష్టం. దళితబంధు పథకంలో భాగంగా నేను ఇదే రంగంలో యూనిట్ ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను. జీవితంలో ఎదగడానికి సీఎం కేసీఆర్ సార్ మంచి అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని అందిపుచ్చుకుని పేదరికాన్ని జయిస్తా.
– శంకర్, లబ్ధిదారుడు, హరిజనవాడ