ఖమ్మం ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం నగరంలో బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ ఆత్మహత్యను కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని, వారికి జెండాలు తప్ప ఎజెండాలు ఏమీ లేవని టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు తాతా మధుసూదన్ ధ్వజమెత్తారు. ఖమ్మం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయిగణేశ్ మృతి బాధాకరమని, ఘటనపై పోలీస్ విచారణ చేపట్టాలని తాము కోరామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న అసంబద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నగరంలోని ఒక కార్పొరేటర్ భర్తపై కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రౌడీషీట్ ఉందని, వాస్తవాలు తెలుసుకొని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడాలని సూచించారు. 2014 తరువాత అతడిపై కేసులు నమోదు కాలేదని, గంజాయి, దొంగనోట్లతో పాటు ఇతర కేసుల్లో అతను దోషిగా తేలినట్లు పోలీసుల రికార్డుల్లో ఉన్న విషయం తెలుసుకోవాలని అన్నారు.
గద్వాల జోగులాంబ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ముందుగా ఆ జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనవసర మాటలు కాకుండాదమ్ముంటే పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురావాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉచిత విద్య, వైద్యం ఎందుకు అందివ్వడం లేదని ప్రశ్నించారు. కర్ణాటకలోని రాయచూరును తెలంగాణలో కలపాలని అక్కడి ఎమ్మెల్యే కోరుతున్నాడని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసే ఎమ్మెల్యే ఆ మాట అన్నారని గుర్తుచేశారు. మంత్రి అజయ్‌కుమార్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ నాయకుల సహనాన్ని పరీక్షించొద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఏమైనా లోపాలు ఉంటే చెప్పాలని, అంతేకానీ వ్యక్తిగత దూషణ ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
తీన్మార్ మల్లన్న ఒక బ్లాక్ మెయిలర్ అని, రూ.కోట్లు అలానే సంపాదించాడని ఆరోపించారు. సాయిగణేశ్ మరణ వాంగ్మూలాన్ని ఏ లాయర్ సమక్షంలో తీసుకున్నారో ఆయన వెల్లడించాలని డిమాండ్ చేశారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల నాయకులు సైకోల్లా మాట్లాడుతున్నారన్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయాయని గుర్తు చేశారు. ఆయా పార్టీల నా యకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, రైతుబంధు సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఖమ్మం ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, నాయకులు చింతనిప్పు కృష్ణచైతన్య, కమర్తపు మురళి, పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, సీనియర్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, గుండ్లపల్లి శేషుకుమార్ పాల్గొన్నారు.