భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): వివిధ సమస్యలపై ప్రజలు అందించిన వినతులు, ఫిర్యాదులను అధికారులు తక్షణం పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించి మాట్లాడారు. భూసమస్యల పరిష్కారానికి వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్లకు సిఫార్సు చేయాలన్నారు. బూర్గంపాడు మండలం భాస్కర్‌నగర్‌కు చెందిన గిరిజన రైతులు గిరి వికాసం పథకంపై వినతి అందించారు. పాల్వంచ పట్టణానికి చెందిన మంజుల టైలరింగ్‌లో మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరారు. కలెక్టర్ వెంటనే ఐటీడీఏ ఎస్వోకు సిఫార్సు చేశారు. గ్రీవెన్స్‌లో డీఆర్వో అశోక్‌చక్రవర్తి, అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పూర్తయిన బ్లాకుల్లో బెడ్స్ ఏర్పాటు చేయాలి
జిల్లాకేంద్రంలోని బోధన ఆస్పత్రిలో నిర్మాణం పూర్తయిన బ్లాకుల్లో బెడ్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం టీఎస్ఐఐసీ అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనుల్లో జాప్యం జరిగితే భవిష్యత్తులో కాంట్రాక్టు పనులు రాకుండా బ్లాక్ లిస్టులో పెడతామని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. ఈ నెల 30 లోపు పనులు పూర్తి చేసి అప్పగించాలన్నారు. అనంతరం సమీకృత కలెక్టరేట్లో జిల్లా అధికారుల సముదాయాన్ని పరిశీలించారు. ఆయన వెంట రోడ్లు భవనాల శాఖ ఈఈ భీమ్లా, ఉద్యానశాఖ అధికారి మరియన్న, విద్యుత్‌శాఖ ఎస్ఈ సురేందర్, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్, ఎఫ్‌డీవో అప్పయ్య, డీఎంఈ ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌రావు, డాక్టర్ ముక్కంటేశ్వరరావు ఉన్నారు.