భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి పూర్తి ఏజెన్సీ జిల్లా. జిల్లాలో 4,17,383 హెక్టార్లలో అటవీప్రాంతం విస్తరించి ఉన్నది. ఇంత పెద్ద అడవిలో అటవీశాఖ అధికారులకు ఎన్నో సవాళ్లు. కలప స్మగ్లర్ల ఆగడాలను కట్టడి చేయాలి. వన్యప్రాణులను కాపాడాలి. మొక్కలను సంరక్షించాలి. పోడును అరికట్టాలి. రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోవాలి. ఇలాంటి అవరోధాలను ఎదుర్కొంటూ వృత్తిలో ముందుకు సాగుతున్నారీ మహిళామణులు. అటవీశాఖ అధికారిణులు. మగవాళ్లకు దీటుగా రాత్రింబవళ్లు అటవీప్రాంత సంరక్షణ కోసం పనిచేస్తున్నారు. వారి సేవలకు సలాం.
అవసరమైతే కాలి నడకన..
దట్టమైన అటవీప్రాంతంలో రోడ్డు సరిగా ఉండదు. కొన్నిసార్లు పదుల కిలోమీటర్లు నడిచే వెళ్లాల్సిన పరిస్థితి. అయినా.. వెరవకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. కాలిబాటన అటవీప్రాంతానికి వెళ్లి మొక్కల సంరక్షణ చేపడుతున్నారు. నీటి తొట్లలో వన్యప్రాణులకు నీరు పోస్తున్నారు. వృత్తి కత్తి మీద సాము అయినప్పటికీ ఒకరికి ఒకరు తోడుగా ముందుకు సాగుతున్నారు. స్మగ్లర్ల ఆగడాలను కట్టడి చేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేరుస్తున్నారు. బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ గార్డులు, సెక్షన్ అధికారులు, డీఆర్వోలు, రేంజ్ అధికారులుగా 140 మంది వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. గోదావరి తీరంలో కలప స్మగ్లింగ్‌ను అరికట్టారు.
మొక్కల సంరక్షణకు ప్రాధాన్యం..
అటవీప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు వేలాది ఎకరాల్లో మొక్కలు పెంచుతున్నారు. ఎదుగుతున్న మొక్కలను పశువులు, మేకలు తినకుండా జాగ్రత్త వహిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నా రు. వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. వేసవి దృష్ట్యా అటవీప్రాంతంలో నీటి తొట్లు ఏర్పాటు చేసి ఎప్పకటికప్పుడు వాటిలో నీరు పోయిస్తున్నారు. అటవీభూములను సంరక్షిస్తున్నారు. పోడు నరుకుతున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అవసరమైతే పోలీసుల సాయంతో నిందితులపై కేసులు పెట్టిస్తున్నారు. ఆదివాసీలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి ఆదరాభిమానాలు చూరగొంటున్నారు.
అటవీప్రాంతంలో విధులు ఒక సవాల్..
మా వృత్తి కేవలం అటవీప్రాంతంలోనే ఉంటుంది. స్మగ్లర్ల ఆగడాలను కట్టడి చేయడానికి, వన్యప్రాణులను కాపాడడానికి ఎంతో కష్టపడాలి. నేను 16 ఏళ్లుగా అటవీశాఖలో పనిచేస్తున్నా. ప్రస్తుతం డివిజనల్ అధికారిగా పనిచేస్తున్నాను. మా డివిజన్లో 30 మంది మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రభుత్వ విధి విధానాలను వందశాతం అమలు చేస్తున్నాం.
– వాడపల్లి, మంజుల, ఫారెస్ట్ డివిజనల్ అధికారి, మణుగూరు
మొక్కల పెంపకం ఇష్టం..
నాకు మొక్కలు పెంచడమంటే చాలా ఇష్టం. అందుకే ఈ ఉద్యోగం ఎంచుకున్నాను. చెట్లు మానవ మనుగడకి మూలాధారం. ఎన్ని చెట్లు పెంచితే ప్రకృతికీ, మనకూ అంత మంచిది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. ప్రకృతి ఒడిలో పని చేయడాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నా. చాలా ఏరియాల్లో విధులు నిర్వర్తించా. ఇప్పుడు తునికాకు సేకరణ, కల్లాల వద్ద పనిచేస్తున్నా.
– కె.దేవి, డీఆర్వో, కొత్తగూడెం
అటవీ సంరక్షణే ధ్యేయం..
అడవి సంరక్షణ నాకు ఇష్టం. వృత్తిలో ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా పట్టుదలతో పనిచేస్తున్నా. అడవిలో పని చేయడం పెద్ద సవాల్. కష్టమైన పనైనా ఇష్టంగా చేస్తున్నాం. మమ్మల్ని ఉన్నతాధికారులు ప్రోత్సహిస్తున్నారు. అటవీ ప్రాంతంలోని ప్రతి చెట్టునూ కాపాడుకుంటాం. వన్యప్రాణులకు అనువైన వాతావరణం కల్పిస్తాం.
– ఎ.ధనలక్ష్మి, డీఆర్వో, జూలూరుపాడు
సమస్యలను అధికమించి పని చేస్తున్నాం..
నేను కరీంనగర్ నుంచి వచ్చాను. వృత్తిలో ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తూ పనిచేస్తున్నాం. అటవీప్రాంతంలో ప్లాంటేషన్ విషయంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అవసరమైతే పోలీసుల సహకారం తీసుకుంటున్నాం. అడవిని రక్షిస్తున్నాం. వన్యప్రాణులను కాపాడుతున్నాం. అనుమతులు లేకుండా కర్ర పుల్లను కూడా బయటకు రానివ్వం. పట్టుదలతో పని చేస్తున్నాం. అందరితో శెభాష్ అనిపించుకుంటున్నాం.
– కుడిక్యాల రంజిత, రేంజ్ అధికారిణి, భద్రాచలం