ఖమ్మం రూరల్, ఏప్రిల్ 17 : సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలు ఉన్న నిరుపేదల కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 మార్చిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి 2022 మార్చి నాటికి ఖమ్మంరూరల్ మండలవ్యాప్తంగా రికార్డు స్థాయిలో దాదాపు 2వేల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. దళారుల ప్రమేయం, నయా పైసా ఖర్చు లేకుండా నేరుగా ఇంటికి చెక్కులు అందిస్తుండంతో లబ్ధిదారుల సంతోషానికి అవధులు లేకుండాపోతున్నాయి. లక్షా నూటపదహారు రూపాయలు సర్కార్ ఉచితంగా అందిస్తుండడంతో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భారం తప్పడంతోపాటు, అప్పులు చేయాల్సిన అవసరం లేకుండాపోతుంది. వివాహమైన వెంటనే స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటున్నారు. మంజూరైన చెక్కులను వారానికోసారి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. సర్కార్ అందిస్తున్న ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరీ చెబుతున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధగా నిరుపేద కుటుంబాలకు నేనున్నా అనే భరోసానిచ్చి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందజేస్తున్న సీఎం కేసీఆర్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలు
ఖమ్మం రూరల్ మండల పరిధిలో మొత్తం 21గ్రామాలకు గాను నేటివరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా 2,046 కుటుంబాలు ప్రయోజనం పొందాయి. పథకం ప్రారంభంలో ఆడపిల్ల పెళ్లికి గాను సర్కార్ రూ.51 వేలు అందించగా, పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని రూ.75 వేలకు పెంచింది. కొద్దిరోజుల్లోనే తిరిగి 1లక్షా116 రూపాయల చొప్పున సర్కార్ సాయం చేస్తున్నది. మండల రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం ఆరెకోడు గ్రామంలో 114 కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరగా, ఆరెంపులలో 60, బారుగూడెంలో 21, గోళ్లపాడులో 93, గుదిమళ్లలో 136, వెంకటగిరిలో 92, గూడూరుపాడులో 35, గుర్రాలపాడులో 35, కాచిరాజుగూడెంలో 58, కొండాపురంలో 53, ఎం.వెంకటాయపాలెంలో 141, మద్దులపల్లిలో 51, ముత్తగూడెంలో 116 కుటుంబాలకు ఆర్థిక సాయం అందింది. అదేవిధంగా పల్లెగూడెం గ్రామంలో 39, పోలేపల్లిలో 76, తల్లంపాడులో 161, తనగంపాడులో 75, తీర్థాలలో 156, ఏదులాపురంలో 239, పెద్దతండాలో 155, తెల్దారుపల్లి గ్రామంలో 116 కుటుంబాలకు సర్కార్ సాయం అందించింది.
పైసా ఖర్చు లేకుండా..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు మంచి ఫలితాలను అందిస్తున్నది. లబ్ధిదారులకు నయా పైసా ఖర్చు లేకుండా సొమ్ము మొత్తం చేతికి అందుతుండడంతో మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శిశువు తల్లి కడుపున ఉన్నది మొదలు పెళ్లీడు వచ్చే వరకు సదరు బాలికలకు సంపూర్ణ ఆరోగ్యం అందించడంతోపాటు వారి పెళ్లిళ్లకు సైతం సర్కార్ అండగా నిలబడుతున్నది. వివాహానికి ముందుగానే అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుంటున్న తల్లిదండ్రులు వివాహమైన వెంటనే మండల రెవెన్యూ అధికారులకు దరఖాస్తు అందజేస్తున్నారు. స్వయంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవడంతో సకాలంలో చెక్‌ల పంపిణీకి మార్గం సుగమం అవుతున్నది. అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలు, మండల అధ్యక్షురాలు, జడ్పీటీసీలు సైతం లబ్ధిదారులపై ఏమాత్రం ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు నేరుగా వారి ఇంటికే వెళ్లి చెక్కులను అందజేస్తున్నారు.
పేదింటి పెద్దకొడుకు సీఎం కేసీఆర్
నిరుపేద కుటుంబానికి పెద్దకొడుకు బాధ్యత తీసుకొని ఆడపిల్ల పెళ్లికి సీఎం కేసీఆర్ సాయం చేస్తున్నారు. అయినవాళ్లే ఆర్థిక సాయం చేయమంటే ఆమడదూరం పోతున్న ఈ రోజుల్లో తెలంగాణ సర్కార్ ఈ పథకం పెట్టి ఆదుకోవడం సంతోషంగా ఉంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు లేకుంటే ఎన్నో కుటుంబాలు ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడేవి. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి చొరవకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– బెల్లం ఉమ, ఎంపీపీ
త్వరితగతిన చెక్కుల అందజేత
కార్యాలయానికి చేరిన కల్యాణలక్ష్మి దరఖాస్తులను త్వరితగతిన పై అధికారులకు చేరవేస్తున్నాం. అర్హత గల కుటుంబానికి ఆర్థిక సాయం తక్షణం అందాలనే ఉద్దేశంతో ప్రణాళికాబద్దంగా పనిచేస్తున్నాం. దీంతో సకాలంలో చెక్కుల పంపిణీ జరుగుతున్నది. లబ్ధిదారులు సర్కార్ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– సుమ, తహసీల్దార్
ప్రభుత్వ సాయం మరువలేం
మా బిడ్డ పెళ్లికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు సాయం చేసింది. ఇంత మంచి పథకం పెట్టిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేం. మాలాంటి ఎందరో పేద కుటుంబాలకు ఈ సాయం ఎంతగానో ఉపయోగపడుతున్నది. పెళ్లికి చేసిన అప్పు ఎట్ల తీరుతదో అనుకున్నా.. కానీ కల్యాణలక్ష్మి సాయం అందడంతో సంతోషంగా ఉన్నాం.
– తోళ్ల వెంకటరమణ, ఏదులాపురం
2016-17 : 99 కుటుంబాలు
2017-18 : 329 కుటుంబాలు
2018-19 : 290 కుటుంబాలు
2019-20 : 271 కుటుంబాలు
2020-21 : 435 కుటుంబాలు
2021-22 : 622 కుటుంబాలు
మొత్తం : 2,046 కుటుంబాలు