మామిళ్లగూడెం, ఏప్రిల్ 17: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు పోలీస్‌శాఖ ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాల్లో అర్హత పరీక్ష నిర్వహించింది. 3,300 మంది అభ్యర్థులు రాశారు. పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. నగరంలోని ఎస్బీఐటీ, ఆర్జేసీ, ప్రియదర్శిని, వికాస్, దరిపల్లి అనంతరాములు ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాలను డీసీపీ (అడ్మిన్) గౌస్ అలమ్ పరిశీలించారు. అభ్యర్థుల సందేహాలను నివృతి చేశారు. రాత పరీక్షకు నిరుద్యోగుల నుంచి భారీ స్పందన లభించిందని విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలో ఉచిత శిక్షణ ప్రారంభిస్తామన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు శిక్షణ ఇస్తారన్నారు. ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు.