మణుగూరు రూరల్, ఏప్రిల్ 17 : ములుగు జిల్లా మంగపేట నియోజకవర్గ ప్రజలు తమను అధికారు లు పెడుతున్న ఇబ్బందులను తట్టుకోలేక శనివారం రాత్రి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావును క్యాంపు కార్యాలయంలో కలిశారు. తమ వద్ద ఉన్న ఆధారాలను చూపి తాము సాగు చేసుకుంటున్న భూమి పూర్వాపరాలను వివరించి న్యాయం చేయాలని విన్నవించారు. ఫారెస్ట్ అధికారులు ఆదివాసీ గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు లాక్కునేందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వివరించారు. వివరాలను పరిశీలించిన ఎమ్మెల్యే రేగా మంగపేట తహసీల్దార్, ఫారెస్ట్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. గిరిజనులు కన్నీటితో ధన్యవాదాలు తెలిపిన తీరు అందరినీ ఆకట్టుకున్నది. సమస్య పరిష్కారం అయినప్పటికీ అధికారులు మళ్లీ ఇబ్బందులకు గురిచేస్తే అవసరమైతే సీఎం కేసీఆర్తో మాట్లాడతానని బాధితులకు హామీనిచ్చారు.