రఘునాథపాలెం, ఏప్రిల్14 : కేంద్రంలోని బీజేపీ రైతులకు తీరని మోసం చేసిందని, కర్షకులకు సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజనూ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రమూ వందశాతం ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు వడ్లు విక్రయించి లాభాలు పొందాలని సూచించారు.
అన్నదాతలు అధైర్యపడొద్దని సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అంబేద్కర్ జయంతి పురస్క రించుకుని తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ సర్కార్ తెలంగాణ రైతులపై వివక్ష చూపుతున్నదన్నారు. రైతులు పండించిన యాసంగి వడ్లను కొనేదిలేదంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పిన తర్వాత గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆందోళనలు చేపట్టినా కేంద్ర సర్కార్‌లో ఏమాత్రం చలనం రాలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో నిరసన చేపట్టినా మోదీ స్పందించకపోవడం రైతులను అవమానించినట్లేనని పేర్కొన్నారు. కేంద్రం తీరుపై ఆగ్రహించిన సీఎం కేసీఆర్ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన రైతుల్లో ధైర్యాన్ని నింపిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్ర సర్కార్..
తెలంగాణ సర్కార్ విద్యుత్ సబ్సిడీ కోసం రూ.12 వేల కోట్లు, రైతుబంధు ద్వారా పంటల పెట్టుబడి కోసం రూ.15 వేల కోట్లు ఆర్థికసాయంతోపాటు సాగునీటి అవసరాలకు ప్రాజెక్టులు నిర్మించి పుష్కలంగా నీరందించడంతో పంటల సాగు పెరిగిందన్నారు. రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకునేది కేసీఆరేనని గమనించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌రావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీఆర్డీఏ పీడీ విద్యాచందన, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మందడపు సుధాకర్, ఆత్మచైర్మన్ భూక్యా లక్ష్మణ్‌నాయక్, మాజీ చైర్మన్ బోయినపల్లి లక్ష్మణ్‌గౌడ్, జడ్పీటీసీ మాళోతు ప్రియాంక, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, మహిళా అధ్యక్షురాలు బానోత్ ప్రమీల, సర్పంచ్ వాంకుడోతు విజయ, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మాదంశెట్టి హరిప్రసాద్, ఎంపీటీసీ తేజావత్ రాణి, ఉపసర్పంచ్ తేజావత్ రమేశ్, నాయకులు వల్లభనేని వెంకటప్పారావు, మంద సంజీవరావు, సైదులు, మాధవరావు, నర్సింహారావు, వెంకటనారాయణ, సైదులు, సీఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.