ఖమ్మం, ఏప్రిల్ 14: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గురువారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులు ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఖమ్మం నగరంలోని జడ్పీ సెంటర్లోని అంబేదర్ విగ్రహానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి పూలమాల వేశారు. రఘునాథపాలెం మండలం చిమ్మపూడి ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మణుగూరులో ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, టేకులపల్లిలో భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్, కూసుమంచిలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, మధిర పట్టణంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం నగరంలోని జిల్లాపరిషత్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించి మాట్లాడారు. దళిత సాధికారత కోసమే సీఎం దళితబంధు అమలు చేస్తున్నారన్నారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక చేయూతనందిస్తున్నారన్నారు. ఎస్సీలు వారికి ఆసక్తి ఉన్న రంగంలో యూనిట్లు స్థాపించుకోవచ్చన్నారు. కూలీల నుంచి లక్షాధికారిగా ఎదగవచ్చన్నారు. జిల్లాలోని చింతకాని మండలం మొదటి విడత దళిత బంధుకు ఎంపికైందన్నారు.
దీని ద్వారా 4,500 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. బాబాసాహెబ్ అంబేదర్ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విద్యతోనే వెనుకబాటుతనం పోతుందని నమ్మిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో ఆ కాలంలోనే అనేక డిగ్రీలు సంపాదించారన్నారు. గొప్ప విద్యావంతుడు కాగలిగారన్నారు. ఈ లక్షణాలే ఆయన్ను రాజ్యాంగాన్ని రచించేందుకు కారణభూతమయ్యాయన్నారు. అంబేద్కర్ బాటలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 978 గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. ఉమ్మడి పాలనలో ఉన్న గురుకులాలు ఇప్పుడు రెట్టింపు అయ్యాయన్నారు. గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు.
ఆయా వర్గాల ప్రజలకు తగిన విధంగా సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారన్నారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని, రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చేవిధంగా ఎదగడమే అంబేద్కర్‌కు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు తాతా మధు, నగర మేయర్ పునుకోల్లు నీరజ, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ సురభి, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, నాయకులు బొమ్మెర రామ్మూర్తి, చింతనిప్పు కృష్ణచైతన్య, తాజుద్దీన్, తొగరు భాస్కర్‌రావు, ప్రసాద్, కంచర్ల దయాకర్, బుర్రి వినయ్ పాల్గొన్నారు.