భద్రాచలం, ఏఫ్రిల్ 14: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రామయ్యకు అర్చకులు ఊంజల్ సేవ జరిపారు. ఉదయం యాగశాలలో చతుఃస్థానార్చన, హోమం, ఆలయ ఆస్థాన విద్వాంసులతో నాదస్వర కచేరి జరిగాయి. పవిత్ర గోదావరి నుంచి పుణ్య జలాలను తీసుకొచ్చి, పంచామృతాలతో రామయ్యను అభిషేకించారు. వేద పండితులు వేద పారాయణం చేశారు. సాయంత్రం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి బాజాభజంత్రీలు, భక్తుల కోలాటాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆలయ ప్రదక్షిణ చేయించి మండపంలో వేంచేయింపజేశారు. విష్వక్సేన ఆరాధాన, పుణ్యాహవాచనం జరిపారు. బేడా మండపంలో ఊయలను అందంగా అలంకరించారు. ఊయలకు ఉన్న నాలుగు గొలుసులను నాలుగు వేదాలుగా, పీఠాన్ని ఆదిశేషునిగా ఆవాహన చేసి ఆరాధించారు. స్వామి వారిని, అమ్మవారిని ఊయలలో వేంచేయింపజేసి చేసి కీర్తనలు పాడుతూ వైభవంగా ఊంజల్ సేవ జరిపారు. ఆలయ ఈవో బానోత్ శివాజీ, ఏఈవో శ్రావణ్‌కుమార్, ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, పొడిచేటి సీతారామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
నేడు వసంతోత్సవం
భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం వసంతోత్సవం నిర్వహిస్తారు. ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు వసంతోత్సవం, ఆ తరువాత తిరువీధి సేవ జరుపుతారు. వేద పండితులు వేద పారాయణం చేస్తారు. రాత్రి 8.00 నుంచి 9.00 గంటల వరకు గజ వాహనంపై స్వామివారికి తిరువీధి సేవ నిర్వహిస్తారు.
రేపు చక్రతీర్థం, పూర్ణాహుతి
ఉత్సవాల్లో భాగంగా శనివారం చక్రతీర్థం, పూర్ణాహుతి జరుపుతారు. తెల్లవారుజామున 4.00 గంటలకు ఆలయ తలుపులు తెరిచి స్వామి వారికి సుప్రభాత సేవ, ఆరాధన, సేవాకాలం నిర్వహిస్తారు. 5.00 నుంచి 5.30 గంటల వరకు దేవస్థానం ఆస్థాన విద్వాంసుల నాదస్వర కచేరి ఉంటుంది. 6.30 నుంచి 7.30 గంటల వరకు గోదావరి తీరంలో చక్రతీర్థం ఉంటుంది. ఆ తరువాత భద్రుడి మండపంలో స్వామి వారిని అభిషేకిస్తారు. 11.00 గంటల వరకు వేద పారాయణం చేస్తారు. సాయంత్రం 6.00 గంటలకు పూర్ణాహుతి, రాత్రి 8.00 గంటలకు శేష వాహనంపై తిరువీధి సేవ, అనంతరం ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశారాధనలు, శ్రీ పుష్పయాగం నిర్వహిస్తారు.