ఖమ్మం, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సర్కారు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు/బస్తీ – మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై దృష్టిసారించిన ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో 426 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించింది. వీటిలో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నది. తొలి దశలో ప్రతి మండలంలోని రెండు పాఠశాలల్లో పనులు చేపపట్టనున్నారు. జిల్లాలోని ఏడు ప్రభుత్వశాఖల ఇంజినీరింగ్ విభాగం అధికారుల నేతృత్వంలో వ్యయ అంచనాలను రూపొందించి పంపించారు. 21 మండలాల్లోని 42 ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన నిర్మాణ పనులు ప్రారంభించారు. జిల్లాలో రెండు పాఠశాలల్లో ‘మన ఊరు- మనబడి/బస్తీ మన బడి’లో భాగంగా రఘునాథపాలెం మండలం ర్యాంకాతండా, ఖమ్మం నగరంలోని రోటరీనగర్ పాఠశాలలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అభివృద్ధి పనులు మొదలు పెట్టారు. ఒక్కొక్క పాఠశాలలో రూ.30 లక్షల అంచనా వ్యయంతో మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణం, తరగతిగదులు, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు.
ప్రత్యేక అధికారుల నివేదికల ఆధారంగా..
మండలాలకు ప్రత్యేక అధికారులుగా ఉన్న జిల్లా అధికారులు మన ఊరు- మన బడికి ఎంపికైన పాఠశాలలను పరిశీలించి ఏఏ అంశాల్లో పనులు అవసరమో గుర్తించి నివేదికలు రూపొందించారు. స్పెషల్ ఆఫీసర్లు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లతో కలిసి అంశాలపై చర్చించి పనులను గుర్తించారు. స్పెషల్ ఆఫీసర్లు గుర్తించిన పనుల్లో అంచనాలను రూపొందించేందుకు ప్రత్యేక ఫార్మాట్లను ఇంజినీరింగ్ అధికారులకు అందజేశారు. అంచనాలు రూపొందించే క్రమంలో ఒకటి రెండు ఇంజినీరింగ్ విభాగం అధికారుల అలసత్వంపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ అధికారులు కమిటీలు, స్పెషల్ ఆఫీసర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా అంచనాలు వేసే పంపించారు.
పనులు ప్రారంభం
జిల్లాలో 21 మండలాలు ఉండగా ప్రతి మండలంలో మన ఊరు- మన బడికి ఎంపికైన స్కూళ్లలో నుంచి రెండు స్కూళ్లను ఎంపిక చేసి పనులు ప్రారంభించనున్నారు. ఇలా జిల్లాలో 42 స్కూళ్లలో అంచనాలు పూర్తి చేసి, అడ్మిన్‌స్ట్రేటివ్ అనుమతుల కోసం పంపించారు.
నూరుశాతం బ్యాంక్ ఖాతాలు ఓపెన్
బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నది. బడులను బాగు చేసేందుకు ప్రభుత్వంతోపాటు పూర్వ విద్యార్థులు, ఎవరైనా దాతలు ముందుకొస్తే వారి సహకారాన్ని తీసుకునేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా రెండు రకాల బ్యాంకు ఖాతాలు తెరువాల్సి ఉంది. మొదటి విడతలో ఎంపికైన పాఠశాలలు బ్యాంక్ ఖాతాలు తెరిచే ప్రక్రియ నూరుశాతం పూర్తయింది. మన ఊరు/బస్తీ -మన బడికి ఎంపికైన స్కూల్స్ ప్రత్యేకంగా రెండు ఖాతాలు తెరిచారు. పాఠశాల పనుల నిర్వహణకు అవసరమైన ఖర్చుల కోసం, దాతలు, పూర్వవిద్యార్థుల విరాళాల నిర్వహణ కోసం అడ్రస్‌లతో కూడిన పత్రాలను బ్యాంక్‌లకు అందజేసి సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాస్‌బుక్ తీసుకున్నారు.
వెబ్ పోర్టల్‌లో అప్లోడ్..
మొదటిదశలో ఎంపిక చేసిన పాఠశాలల్లోని అవసరాలను గుర్తించి, తీర్మానం చేసిన వివరాలను వెంటనే ప్రధానోపాధ్యాయులు వెబ్‌పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల ఎంఐఎస్ కోఆర్డినేటర్లకు శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక యాప్‌ను సైతం రూపొందించారు. వెబ్సైట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఎంఈవోలు అందజేశారు. ప్రభుత్వం స్పష్టం చేసిన 12 అంశాలకు సంబంధించిన ప్రస్తుత స్థితి ఫొటోలను యాప్‌లో పొందుపరుస్తున్నారు.