భద్రాచలం, ఏప్రిల్ 13: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రుని దేవస్థానంలో నిర్వహిస్తున్న వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఆలయ అధికారులు, అర్చకులు సీతారాములకు పావన గోదావరిలో ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఉదయం యాగశాలలో చతుః స్థానార్చన, హోమం చేపట్టారు. దేవస్థాన ఆస్థాన విద్వాంసులు నాదస్వర కచేరి చేపట్టారు. భద్రుని కోవెలలో అర్చకులు స్వామివారికి అభిషేకం, వేద పారాయణం చేపట్టారు. సాయంత్రం ఉత్సవ మూర్తులను మేళతాళాలు, కోలాటాలు, వేద పండితుల మంత్రాల నడుమ గోదావరి తీరానికి తీసుకెళ్లారు. ప్రత్యేకంగా అలంకరించిన పడవపై సీతారాములను ఉంచి జలవిహారం గావించారు. అనంతరం సీతారాములను అశ్వ వాహనంపై ఉంచి తిరువీధి సేవ, దొంగల దోపు (చోరోత్సవం) ఉత్సవం నిర్వహించారు.
అనంతరం రక్షక భటులు దొంగలా పరకాలుడి వేషధారణలో ఉన్న వ్యక్తిని పట్టుకునే ఘట్టం భక్తులను ఆకట్టుకున్నది. వేడుకను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు అమరవాది విజయరాఘవన్, ఆలయ ఈవో బానోత్ శివాజీ, ఏఈవో శ్రావణ్‌కుమార్, ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి పాల్గొన్నారు. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున దేవస్థాన ఆస్థాన విద్వాంసుల సంగీత కచేరి, మధ్యాహ్నం అర్చకుల వేద పారాయణం, రాత్రి ఊంజల్ సేవ (ఉయ్యాల సేవ), అనంతరం సింహ వాహన సేవ నిర్వహిస్తారు.