ఖమ్మం, ఏప్రిల్ 13: రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ఈనెల 16న ఖమ్మం నగర పర్యటనకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని, లోటుపాట్లకు తావు ఉండరాదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. ఖమ్మం నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్‌తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ రఘునాథపాలెంలోని సుడా బృహత్ పల్లె ప్రకృతి వనం, టేకులపల్లిలో గృహ సముదాయం, ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద ఫుట్‌పాత్ జోన్, నూతన మున్సిపల్ కార్యాలయ భవనం, మ్యూజికల్ ఫౌంటేన్, సస్పెన్సన్ బ్రిడ్జి, దానవాయిగూడెం ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ప్రకాశ్‌నగర్‌లోని శ్మశానవాటికను ప్రారంభిస్తారన్నారు. శ్రీనివాస్‌నగర్‌లోని సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం లకారం ట్యాంక్ బండ్ వద్ద బహిరంగ సభలో మాట్లాడతారన్నారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, మధుసూదన్, డీసీసీబీ చైర్మన్, కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.