కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతున్నది. యాసంగి ధాన్యంలో వచ్చే 37శాతం నష్టం కేంద్రమే భరించాలి. అది చేయకుండా బీజేపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు. మోరీల్లాగా నోరెల్లబెట్టుకొని పెడబొబ్బలు పెడుతున్నారు. రైతులను ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. సీఎస్ నేతృత్వంలో కమిటీ వేశాం. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో సమర్థమైన ప్రభుత్వం ఉంది. రైతులు తక్కువ ధరకు వడ్లు అమ్ముకొని నష్టం పోవద్దు. ప్రతి గింజా కొనుగోలు చేస్తాం. క్వింటాకు రూ.1960 చెల్లిస్తాం. ధాన్యం డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తాం.
ఖమ్మం, ఏప్రిల్12( నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : కేంద్రం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను మోసం చేసింది. యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొ చ్చింది. దశలవారీగా ఉద్యమం చేపట్టింది. అయినా కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణ రైతులపై వివక్ష చూపింది. వారికి తీరని అన్యాయం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అన్నదాతలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, యాసంగిలో పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. కాగా జిల్లాలో యాసంగిలో లక్షా ఐదువేల ఎకరాల్లో వరి సాగు చేశారు. 2.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. లక్ష మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారుల అంచనా. సుమారు 100 నుంచి 120 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో 8 వేల ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి.
రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపికబురు అందించారు. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానికి ఉన్నా.. తెలంగాణ రైతులపై వివక్ష చూపుతున్నది. ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటం చేసింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఢిల్లీలో సైతం ధర్నా నిర్వహించింది. కేంద్రంలోని తోలు మందం బీజేపీ సర్కారు ఏమాత్రం కనికరం చూపలేదు. మొండిగా వ్యవహరిస్తోంది. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఈ క్రమంలో కర్షకులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ ముందుకొచ్చారు. యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్మి నష్టపోవద్దని చెప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేడు అధికారులతో మంత్రి సమావేశం
రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాగం సమాయత్తం అవుతున్నది. బుధవారం ఉదయం 11గంటలకు టీటీడీసీ భవనంలో అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై అనుసరించాల్సిన విధానం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, యాసంగిలో పండిన ధాన్యం, విక్రయించడం తదితర అంశాలపై మంత్రి చర్చించనున్నారు.
లక్షా ఐదువేల ఎకరాల్లో వరిసాగు
జిల్లాలో యాసంగిలో లక్షా ఐదువేల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు రెండు లక్షల నలబైఐదు వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. లక్ష మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో సుమారు 100 నుంచి 120 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో 8 వేల ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి.
2.48 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
ఈ ఏడాది యాసంగిలో జిల్లావ్యాప్తంగా 2,48,323 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి రావొచ్చని వ్యవసాయశాఖ అధికారుల అంచనా. ఈ నెల మొదటి పక్షంలో 27,355 మెట్రిక్ టన్నులు, ఈనెల రెండోపక్షంలో 82,578 మెట్రిక్ టన్నులు, మే మొదటి పక్షంలో 93,363 మెట్రిక్టన్నులు, మే రెండో పక్షంలో 45,027 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు నెలల్లో పూర్తిస్థాయిలో పంట చేతికి రానున్నది.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్ధం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం. రైతులు కనీస మద్దతు ధరకు వడ్లు కొనుగోలు చేయడంతోపాటు ఇబ్బందులు తలెత్తకుండా అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నాం. రెండు రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. సుమారు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించే అవకాశం ఉంది.
– అదనపు కలెక్టర్, మధుసూదన్
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
యాసంగి వడ్లను కేంద్రం కొననని చెప్పింది. ఆందోళన చెందుతున్న సమయంలో సీఎం కేసీఆర్ రైతులకు శుభవార్త చెప్పారు. వడ్లను కొంటామని చెప్పడం అభినందనీయం. కేంద్రం వడ్లను కొనుగోలు చేయకుండా రైతులపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నది. ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టేలా మోదీ ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరం. రైతు బాధలను అర్థం చేసుకొని ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం చెప్పడం ఎంతో ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్కు రైతులు రుణపడి ఉంటాం.
– వేమూరి ప్రసాద్, తూటికుంట్ల, బోనకల్లు మండలం
రైతులను మోసం చేసిన బీజేపీ
యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పడం అభినందనీయం. కేంద్రం రైతులపై వివక్ష చూపుతున్నది. ధాన్యం కొనుగోలు విషయంలో కర్షకులను మోసం చేస్తున్నది. రైతుల పక్షాన పోరాడిన సీఎం సార్కు అభినందనలు. మేమంతా టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాం.
– ఇటికాల శ్రీనివాసరావు, కలకోట, బోనకల్లు మండలం