భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) ; జీవవైవిద్యం ఉంటేనే మానవ మనుగడ సాధ్యం. మనుషులతోపాటు వన్యప్రాణులు సైతం చల్లగుండాలని, హాయిగా జీవించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్తున్నది. అంతరించిపోతున్న అడవి జంతువులు, పక్షులను కాపాడుకునేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నది. ఏటా లక్షల చెట్లను పెంచడంతో పాటు వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు నీటి కుంటలు, సాసర్ పిట్లు, ర్యాంపులను నిర్మించింది. కార్చిచ్చు నుంచి అడవిని కాపాడుకునేందుకు ప్రత్యేకంగా ఫైర్లైన్లను ఏర్పాటు చేసింది. అడవితల్లిని కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందంటూ గ్రామాల్లో అవగాహన సదస్సులు సైతం నిర్వహిస్తున్నది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10లక్షల ఎకరాలు అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అందులో కొండెగొర్రెలు, చుక్కల దుప్పిలు, అడవి పం దులు, కుందేళ్లు, ఎలుగుబంటి, అడవి పులి, నక్కలు, తోడేళ్లు, ముళ్లపం ది, చిరుతపులి, కొండముచ్చులు ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నాయి. వీటి సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వేసవికాలంలో జంతువులు, పక్షుల దాహార్తి తీర్చేందుకు సాసర్ పిట్లు, ఇంకుడు, నీటినిల్వ గుంతలు, సహజ సిద్ధంగా ఉన్న నీటి కుంటలు, చెలిమెలు ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నా రు. జిల్లాలో 777 సాసర్ పిట్లను నాలుగు కిలోమీటర్లకు ఒకటి చొప్పున నిర్మించారు. వీటితోపాటు పర్పులేషన్ ట్యాంకులను కూడా నిర్మించారు. కుంటల్లో నీటిని నింపేందుకు గతేడాది రెండు సోలార్ పంపులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో సాస్ వెల్స్, ర్యాంప్ వెల్స్, చెక్‌డ్యాంలు సైతం నిర్మించారు. శాఖాహార జంతువుల ఆహారం కోసం గడ్డి క్షేత్రాలను పెంచుతున్నారు. పులుల సంచారం పెరగడంతో శాఖాహార జంతువుల రక్షణకు కావాల్సిన చర్యలు చేపడుతున్నారు. జింకలు, దుప్పులు, కుందేళ్లు, ఇతర శాఖాహార జంతువులకు ఆహారం, నీటికొరత రాకుండా ప్రత్యేక దృష్టి సారించారు. కొత్తగూడెంలో 157, ఇల్లెందులో 120, పాల్వంచలో 102, మణుగూరు 88, భద్రాచలం 140, కిన్నెరసాని అభయారణ్యంలో 170 సాసర్ పిట్లు ఏర్పాటు చేశారు.
ఫైర్లైన్లతో కార్చిచ్చు నుంచి రక్షణ
ప్రతి వేసవిలో ఆకులు వట్టిపోయి నేలరాలుతాయి. మంటలు అంటుకునే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం రోడ్డు మార్గంలో వెళ్లే బాటసారులు, వాహనదారులు కాల్చిన బీడీలు, సిగరెట్లను పడేయడమే. దీంతో అడవుల్లోని వృక్షాలతోపాటు జీవాలకు కూడా నష్టం వాటిల్లుతున్నది. దీని నిరోధించడానికి అటవీశాఖ ఫైర్లైన్లు ఏర్పాటు చేసింది. ఆయా గ్రామాల ప్రజలకు అటవీశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దానిద్వారా జరిగే నష్టాలను వివరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిప్పును అటవీ ప్రాంతంలో పడవేయరాదని సూచిస్తున్నా రు. అటవీశాఖ సిబ్బందితోపాటు బేస్ క్యాంపు సిబ్బంది రోజూ ప ర్యవేక్షిస్తూ మంటలు చెలరేగకుండా అప్రమత్తంగా ఉంటూ కంటికిరెప్పలా అడవిని, జంతువులను కాపాడుతున్నారు. కార్చిచ్చు ద్వా రా అడవి తగలబడకుండా ట్రెంచ్‌లను ఏర్పాటుచేసి రక్షిస్తున్నారు.
ట్యాంకర్లతో నీరు తరలింపు..
అటవీ ప్రాంతంలో చెక్‌డ్యాంల ద్వారా వచ్చే నీటిని కుంటల్లోకి తరలించి అందుబాటులో ఉంచుతున్నారు. మరీ అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని అడవిలోకి తీసుకువెళ్లి సాసర్ పిట్లను నింపుతున్నారు. చెరువులు, చెక్‌డ్యాంలు, నీటి కుంటలు అందుబాటులో ఉంచారు.వేటగాళ్ల ఉచ్చులకు జంతువులు బలవ కుండా రాత్రులు సిబ్బందిని గస్తీలో ఉంచుతున్నారు. బహిరంగ ప్రదేశాలకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
జంతువుల సంతతి పెరిగింది
అడవిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ప్రతి ఏటా హరితహారంలో 50లక్షల వరకు మొక్కలు పెంచుతున్నాం. ప్లాంటేషన్లు కూడా బాగా పెంచాం. అడవి, జంతువుల సంరక్షణకు ప్రభుత్వం అటవీశాఖ ఆధ్వర్యంలో అన్నిరకాల చర్యలు చేపడుతున్నది. ప్రతి గ్రామంలో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
–అప్పయ్య, ఎఫ్‌డీవో, కొత్తగూడెం