భద్రాచలం, ఏప్రిల్ 12 : భద్రాచలం పట్టణం ఇక మున్సిపాలిటీగా మారనున్నది. దీంతో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. ఆదివాసీ గిరిజన ప్రాంతాలైన ఆసిఫాబాద్, సారపాక, భద్రాచలం గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్పు చేయాలని మంగళవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో భద్రాచలం పట్టణవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2003లో భద్రాచలాన్ని శ్రీరామ దివ్యక్షేత్ర టౌన్‌షిప్‌గా మార్చారు. ఏడాదిన్నర మాత్రమే టౌన్‌షిప్‌గా కొనసాగింది. అనంతరం 2005లో భద్రాచలం, సత్తుపల్లి, పాల్వంచ, మణుగూరు పట్టణాలను మున్సిపాలిటీగా మారుస్తూ అప్పటి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో పట్టణానికి చెందిన కొంతమంది గిరిజన నాయకులు హైకోర్టులో పిల్ వేయడంతో ఒక్క భద్రాచలం పట్టణం మాత్రమే గ్రామ పంచాయతీగా మిగిలిపోయింది. ఏడాదిన్నర మాత్రమే భద్రాచలం మున్సిపాలిటీగా కొనసాగింది.
అంతకుముందు 30ఏళ్లుగా భద్రాచలం గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగలేదు. 2013 ఏప్రిల్‌లో భద్రాచలం గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరిపారు. అనంతరం 2018లో పాలకవర్గం పదవీకాలం పూర్తైంది. అప్పటినుంచి పంచాయతీ ఎన్నికలు జరుపకుండా భద్రాచలం పట్టణాన్ని ప్రతిపాదిత మున్సిపాలిటీగా ఉంచారు. సారపాకను కూడా కలిపి భద్రాచలం మున్సిపాలిటీగా మారనుండడంతో నిధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో పట్టణం అభివృద్ధి చెందనున్నది. అలాగే మున్సిపాలిటీ ఎన్నికలను నిర్వహించే అవకాశమూ ఉంది. ఎట్టకేలకు క్యాబినెట్ నిర్ణయంతో భద్రాచలం రూపురేఖలు మారనున్నాయి. భద్రాచలం మున్సిపాలిటీగా మారనుండడంతో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావుతోపాటు పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.