మధిర టౌన్, బోనకల్లు, కారేపల్లి, రఘునాథపాలెం, ఏప్రిల్ 12: సీఎం కేసీఆర్‌తోనే తమ కుటుంబాల్లో వెలుగులు నిండాయని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పేర్కొన్నారు. మూడేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ తరువాత రెగ్యులరైజ్ కాబోతున్న తమకు ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడని అన్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులంతా కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న గ్రామాల అభివృద్ధి, పాలనా సౌలభ్యం కోసం తండాలను పంచాయతీలుగా చేసిన కేసీఆర్.. వాటి పర్యవేక్షణకు తమకు నియమించారని అన్నారు. ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తూ పంచాయతీల అభివృద్ధికి కృషి చేశామన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇకముందు కూడా సహాయ సహకారాలు అందజేస్తూ విధులు నిర్వహిస్తామన్నారు.