భద్రాచలం, ఏప్రిల్ 12: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి మంగళవారం సాయంత్రం బేడా మండపం వద్ద సదస్యం నిర్వహించారు. కల్యాణం జరిగిన తరువాత మూడో రోజున నూతన వధూవరులైన రామయ్యకు, సీతమ్మకు వేద పండితులు వేదాశీర్వచనం చేస్తారు. దీనినే సదస్యంగా పేర్కొంటారు. స్వామివారి కల్యాణం తిలకించిన భక్తులకు సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ ఉత్సవాల్లో భాగంగా సదస్యం నిర్వహిస్తారు. ఏటా పలు రాష్ర్టాల నుంచి వందలాది మంది వేద పండితులు హాజరై స్వామివారికి వేదాశీర్వచనం అందజేసేవారు. ఈ ఏడాది కూడా వివిధ రాష్ర్టాల నుంచి సుమారు 500 మంది వేద పండితులు హాజరై స్వామివారికి వేదాశీర్వచనం అందజేశారు. ఉదయం ఉత్సవ పెరుమాళ్లకు బేడా మండపంలో స్నపన తిరుమంజనం చేసి పట్టువస్ర్తాలు ధరింపజేశారు. యాగశాలలో నిత్య హోమం జరిపారు.
అనంతరం చతుఃస్థానార్చన, నిర్వహించి, వేదాలు పఠించారు. సాయంత్రం రామచంద్రుల మహా ప్రభువుల వారికి మహదాశీర్వచనం అందజేశారు. ముందుగా స్వామివారికి వైష్ణవ సంప్రదాయం ప్రకారం విశ్వక్సేనుల వారిని ఆరాధించి, పుణ్యాహవాచనం జరిపి, అష్టదిక్పాలక ఆవాహన చేశారు. అర్చకులు చతుర్వేదాలు పఠిస్తుండగా క్రమాంతం, ఘన. జఠ అనే మంత్రాలను పండితులు పఠించారు. దీంతో రామాలయ ప్రాంగణం వేద మంత్రాలతో పులకించి పోయింది. తరువాత స్వామివారికి బుక్కా గులాలు, అత్తరు, పన్నీరు సమర్పించి, వాటిని ఆలయ అధికారులు, సిబ్బందిపై చల్లారు. వేద పండితులకు అధికారులు శేష వస్ర్తాలను, సంభావన అందించి సత్కరించారు. బుధవారం దొంగల దోపోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.