ఖమ్మం/ ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 11: ఎండనక, వాననక కష్టపడి పండించిన తెలంగాణ రైతుల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేంద్రంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీలో సోమవారం చేపట్టిన దీక్షలో ఎంపీ నామా మాట్లాడారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించకపోతే రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని స్పష్టం చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రీ రవి), డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, టీడబ్ల్యూఆర్డీసీ చైర్మన్ వీ.ప్రకాశ్, ఖమ్మం జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, టీఆర్ఎస్ నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, కనకమేడల సత్యనారాయణ, బాణాల వెంకటేశ్వర్లు, చిత్తారు సింహాద్రి, హరికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ ధర్నాలో ప్రజాప్రతినిధులు
తెలంగాణ రైతుల యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మహాధర్నాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొని కేంద్రం తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ డీ.లక్ష్మీప్రసన్న నల్ల గులాబీలను నెత్తిపై పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, కేఎంసీ మేయర్ నీరజ, టీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.