కొణిజర్ల, ఏప్రిల్ 11: గురుకుల పాఠశాలలో కార్పొరేట్ స్థాయికి దీటుగా విద్యాబోధన అందించడంలో అధ్యాపకుల పాత్ర కీలకమైనదని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ గుగులోత్ శంకర్‌నాయక్ పేర్కొన్నారు. మండలంలోని తనికెళ్ల గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులతో సోమవారం ఆయన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ గురుకులాలను ఏర్పాటు చేసిందని అన్నారు. వాటిల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం గర్వకారణమన్నారు. గురుకులాల్లో చదివే విద్యార్థులు నీట్, ఐఐటీ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపి సీట్లు సాధిస్తున్నారని అన్నారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులంతా విద్యతోపాటు సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని అన్ని రంగాల్లో రాణించి తల్లిదండ్రులకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. గురుకుల విద్యార్థుల సృజనాత్మకతను తాను గుర్తించానని అన్నారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై చర్చించిన ఆయన.. సమాచార హక్కు ప్రాధాన్యాన్ని విద్యార్థినులకు వివరించారు. ఆర్డీవో రవీంద్రనాథ్, తహసీల్దార్ సైదులు, రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లు మానస, ప్రజ్ఞ, ఐశ్వర్య, కళాశాల ఏవోలు నరసింహారావు, చంద్రయ్య పాల్గొన్నారు.