భద్రాచలం, ఏప్రిల్ 8 : టిక్కెట్లు లేని వ్యక్తులను సెక్టార్లలోకి అనుమతించవద్దని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సెక్టార్ ఇన్చార్జి, ప్రొటోకాల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్టార్ అధికారుల బాధ్యత ప్రధానమైందని, సెక్టార్లలోని భక్తులు స్వామివారిని వీక్షించేందుకు నిలబడే అవకాశం ఉన్నందున పోలీస్, సెక్టార్ అధికారులు వారిని అదుపు చేయాలని సూచించారు. భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ వారి మన్ననలను పొందాలన్నారు. ప్రతి సెక్టార్లో మంచినీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని తెలిపారు. సమాచార కేంద్రాల్లో భక్తుల కోసం తయారు చేసిన కరపత్రాలను ఉచితంగా పంపిణీ చేయాలన్నారు.
సబ్ కలెక్టరేట్ నుంచి సీసీ టీవీల ద్వారా పటిష్ఠ పర్యవేక్షణ ఉంటుందని, లోటుపాట్లు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పిపోయిన వ్యక్తులు, చిన్నారుల సమాచారాన్ని 08743-232433, 08743-232301, 08743-232444 కంట్రోల్ రూంలకు ఇవ్వాలని, కంట్రోల్ రూం అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారని చెప్పారు. పారిశుధ్య సిబ్బందికి ప్రత్యేక పాసులు జారీ చేస్తున్నామని తెలిపారు. సమస్య రాకుండా ప్రొటోకాల్ అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రసాద విక్రయాల సిబ్బంది గ్లౌజులు వేసుకోవాలని అన్నారు. పట్టణంలో 80 తలంబ్రాల కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వివరించారు. అనంతరం పారిశుధ్య కార్మికులు, పర్యవేక్షణాధికారులకు యూనిఫాం పంపిణీ చేశారు. ఈ సమావేశంలో అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.