
ఏన్కూరు, జూలై 7: పల్లెల్లో పచ్చందాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. మండలంలోని నూకాలంపాడు గ్రామ పంచాయతీలో వైకుంఠధామం, పల్లెప్రకృతివనాన్ని మంత్రి అజయ్ బుధవారం ప్రారంభించారు. అనంతరం వైకుంఠధామంలో మొక్కలు నాటారు. తరువాత సర్పంచ్ ఇంజం శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతినెలా గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించడం వల్ల మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ జరుగుతోందన్నారు. దీంతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. వైరా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కారేపల్లిలో 100 బెడ్ల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానని, నియోజకవర్గ సమస్యలను త్వరలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని మాట ఇచ్చారు.
సూపరయ్యా.. శేషగిరీ..
ప్రకృతివనం, వైకుంఠధామాలను అద్భుతంగా తీర్చిదిద్దినందుకు సర్పంచ్ ఇంజం శేషగిరిరావును ‘సూపరయ్యా.. సర్పంచ్..’ అంటూ మంత్రి అజయ్ అభినందించారు. శాలువాతో సన్మానించారు. నూకాలంపాడును ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని ఇతర సర్పంచ్‌లకు సూచించారు.
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ కోరారు. ప్రజాప్రతినిధులు తమ పదవులకు వన్నె తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ గ్రామ పంచాయతీలకు ప్రతినెలా రూ.25 వేల కోట్ల నిధులు విడుదల చేస్తోందన్నారు. దేశంలో ప్రతి గ్రామ పంచాయతీకీ ట్రాక్టర్ ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ భుక్యా లాలునాయక్, ఎంపీపీ ఆరెం వరలక్ష్మి, జడ్పీటీసీ బాదావత్ బుజ్జి, ఎంపీటీసీ స్వర్ణశిరీష, టీఆర్ఎస్ నాయకులు బాణోతు సురేశ్, గుత్తా వెంకటేశ్వరరావు, మేడా ధర్మారావు, అశోక్, తహసీల్దార్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
వెదజల్లే పద్ధతే మేలు: మంత్రి అజయ్‌కుమార్
కొణిజర్ల, జూలై 7: వెదజల్లే పద్ధతి ద్వారా చేసే వరి సాగులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, తక్కువ ఖర్చు, అధిక దిగుబడి సాధించవచ్చని మంత్రి అజయ్‌కుమార్ రైతులకు సూచించారు. మండలంలోని జమ్మికాయబంజర సమీపంలోని ఓ పంట చేలో వెదజల్లే ప్రక్రియను ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి నిర్వహించారు. అనంతరం సబ్సిడీపై అందించే వరి విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ దొడ్డపునేని రామారావు, ఎంపీపీ గోసు మధు, జడ్పీటీసీ పోట్ల కవిత, మండల ప్రత్యేకాధికారి పరంధామరెడ్డి, శిక్షణ కలెక్టర్ బీ.రాహుల్, డీఏవో విజయనిర్మల, తహసీల్దార్ ఆర్.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.