ఖమ్మం, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రం తీరుపై గులాబీశ్రేణులు జంగ్ సైరన్ మోగించారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని ప్రతినబూనారు. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా చేపట్టిన నిరసన దీక్షలు విజయవంతమ య్యాయి. ఉదయం 8 గంటలకే మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు నల్లజెండాలతో దీక్ష చేపట్టారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ దీక్షలో రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. కేంద్రం వైఖరిపై నిప్పులు చెరిగారు. ఏన్కూరు, తల్లాడ, వైరా, ఖమ్మం మండలాల్లో ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పాల్గొన్నారు. బూర్గంపహాడ్‌లో రైతు నిరసన దీక్షకు భద్రాద్రి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మంత్రి పువ్వాడతో కలిసి హాజర య్యారు. ఆయా మండల కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, జడ్పీచైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొని కేంద్రం తీరుపై మండిపడ్డారు.
కేంద్రం వడ్లు కొనేదాక కొట్లాడుదామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అధిష్ఠానం పిలుపు మేరకు సోమవారం కేంద్ర వైఖరికి నిరసనగా మండలంలోని మంచుకొండ ప్రధాన రహదారిపై రైతులు, పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన రాస్తారోకోలో ఆయన మాట్లాడారు. గతేడాది వరకు రైతులు పండించిన ధాన్యాన్ని సొసైటీలు, డీసీసీబీలు, డీసీఎంఎస్‌లు కొనుగోలు చేసి ఎఫ్‌సీఐకి అప్పగించేవారన్నారు. ఈఏడాది కేంద్రం ధాన్యం కొనుగోలుపై మొండివైఖరి అవలంబిస్తుందన్నారు. ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని దుయ్యబట్టారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన ఆహార భద్రత చట్టాన్ని హేళన చేస్తున్నదని మండిపడ్డారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం దొంగాట ఆడుతున్నదన్నారు. బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక మాట..గల్లీలో మరో మాట మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రం నుంచి నలుగురు మంత్రులు, ఎనిమిది మంది ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ధాన్యం కొనాలని కోరామన్నారు. అందుకు సదరు కేంద్ర మంత్రి అవమానపరిచే విధంగా మాట్లాడారని ధ్వజమెత్తారు.
యాసంగిలో వడ్లు పట్టిస్తే నూకలు వస్తాయని, వాటిని తెలంగాణ ప్రజలకు తినిపించాలనే వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. గతంలో బాయిల్డ్ రైస్ తీసుకొని ఇప్పుడు వద్దనడం సరికాదన్నారు. ఉపాధి హామీ పథకం పనుల విషయంలోనూ కేటాయింపులు సక్రమంగా లేవన్నారు. కేంద్రం బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయం పాటిస్తున్నదన్నారు. దేశంలో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. పంజాబ్ రైతులు ఢిల్లీలో దీక్షలు చేపట్టి వాటిని రద్దు చేయించారన్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ ఆ రైతులకు క్షమాపణ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి వడ్లు కొనకపోతే ఇదే తరహాలో ఉద్యమిస్తామన్నారు. అన్నదాతల జీవన్మరణ సమస్యగా మారిన ధాన్యం కొనుగోలు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేవరకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాడతామన్నారు. రాష్ట్రంలో సాగు పండుగ అయిందన్నారు.
ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలు అమలు చేస్తుందన్నారు. నీటి తీరువా వసూలు చేయని దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. దీక్షలో ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, ఖమ్మం నగర మేయర్ పునకొల్లు నీరజ, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, ఏఎంసీ మాజీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ మందడపు నర్సింహారావు, మంచుకొండ సొసైటీ చైర్మన్ సుధాకర్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు మాదంశెట్టి హరిప్రసాద్, ఎంపీపీ భుక్యా గౌరి, వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్, ఆత్మ చైర్మన్ భూక్యా లక్ష్మణ్‌నాయక్, నాయకులు సత్యం, భాస్కర్‌రావు, ప్రమీల, రామారావు, నున్నా శ్రీనివాసరావు, వెంకట్, నాగేశ్వరరావు, పూర్ణచందర్రావు, శ్రీనివాసరావు, రామోజీ, కీమా, నరేశ్, లక్పతినాయక్, రమేశ్, విజయ, సకీనా, సైదులు, రవి, వెంకటనారాయణ, లక్ష్మణ్ గౌడ్, రాఘవేంద్ర, ప్రదీప్ పాల్గొన్నారు.
కేంద్రంలో బీజేపీ ద్వంద్వ వైఖరి బూర్గంపహాడ్ నిరసన దీక్షలో మంత్రి అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ రేగా
బూర్గంపహాడ్, ఏప్రిల్ 4: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హెచ్చరించారు. బూర్గంపహాడ్ మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో కలిసి మాట్లాడారు. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదని మండిపడ్డారు.పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ రంగ సంస్థలను ధారాదత్తం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు చేయమని మంత్రులు, ఎంపీలు అడిగితే కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అవమానకరంగా మాట్లాడారన్నారు.
ధాన్యం కొనుగోలుపై రైతులు ఉద్యమిస్తుంటే బీజేపీ నాయకులకు మాత్రం ఏమీ పట్టడం లేదన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు బీజేపీని భూస్థాపితం చేస్తారన్నారు. రైతుల ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ కేంద్రంపై పోరాతుందన్నారు. కేంద్రం దిగి వచ్చేదాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల నాయకత్వంలో ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఏఎంసీ చైర్పర్సన్ ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల, వర్కింగ్ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం జగదీశ్, ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, సర్పంచ్ సిరిపురం స్వప్న, పార్టీ నాయకులు గోనెల నాని, సోము లక్ష్మీచైతన్యరెడ్డి, మేడిగం లక్ష్మీనారాయణరెడ్డి, కామిరెడ్డి రామకొండారెడ్డి, కొనకంచి శ్రీను, బెజ్జంకి కనకాచారి, పొడియం నరేందర్, గాదె నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోరాటాలకు టీఆర్ఎస్ సిద్ధం
బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ధ్వజమెత్తారు. కార్పొరేట్ సంస్థలకు కోట్ల రుణాలను మాఫీ చేస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఉపయోగపడే ఒక్క మంచి పథకమూ తీసుకురాలేదన్నారు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందన్నారు. కేంద్రం మెడలు వంచి యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఉద్యమిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఏది మొదలుపెట్టినా విజయం తథ్యమన్నారు. ఇదే తరహాలో కేంద్రమూ ధాన్యం కొనుగోలు చేయిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
-టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు
బీజేపీకి రైతుల ఉసురు తగులుతుంది..
ధాన్యం కొనాలని పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తులు చేశాం. కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంటున్నది. తెలంగాణపై వివక్ష చూపుతున్నది. బీజేపీ నాయకులు తలాతోక లేకుండా మాట్లాడుతుండగా.. కేంద్రం రోజుకో కొర్రీ పెడుతూ యాసంగి వడ్ల కొనుగోలుపై సమాధానం దాటవేస్తున్నది. కేంద్రంతో తాడోపేడో తేల్చుకో కపోతే అన్నదాతలు నష్టపోయే ప్రమాదం ఉంది. రైతుల ప్రయోజనం కోసం ఢిల్లీపై సీఎం కేసీఆర్ దండయాత్రకు సిద్ధమయ్యారు. వివిధ రాష్ర్టాల్లో పండించిన ధాన్యాన్ని లేదా వాటి ద్వారా వచ్చే బియ్యాన్ని సేకరించాలనే లక్ష్యంతోనే 1965లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఆనాటి ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చాయి. ఎఫ్‌సీఐ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు యథావిధిగా కొనుగోళ్లు చేస్తూ వస్తున్నది. కానీ బీజేపీ సర్కారు మోకాలడ్డుతున్నది. కేంద్ర సర్కార్‌కు కర్షకుల ఉసురు తగులుతుంది. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులతోపాటు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన కరెంటు అందిస్తున్నది. ఏడేళ్లలోనే దేశానికే అన్నం పెట్టే స్థితికి తెలంగాణ చేరింది.
– రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్