భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 2:‘ ‘శ్రీశుభకృత్’ తెలుగు సంవత్సరాది మాత్రమే కాదు.. ఉద్యోగ నామ సంవత్సరం కూడా. సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాదంతా నోటిఫికేషన్లు, పోటీ పరీక్షల సందడే కొనసాగనున్నది.. ఇప్పటికే నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. కొలువుల సాధనే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధ మవుతున్నారు. వారికి సరైన గైడెన్స్ ఇచ్చే విధంగా ‘నమస్తే’ ప్రత్యేకంగా నాలుగు పేజీల ‘నిపుణ’ను ప్రచురిస్తున్నది. అభ్యర్థులారా.. ఇక ప్రిపరేషనే కీలకం.
శ్రీశుభకృత్’ అంటే తెలుగు సంవత్సరాది మాత్రమే కాదు.. ఉద్యోగ నామ సంవత్సరం కూడా. దీనినే రుజువు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందుకు అనుగుణంగానే ఈ ఏడాదంతా కొలువుల జాతర కొనసాగనుంది. మొత్తం 91 వేలకుపై ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రకటన చేసింది. టెట్ మాదిరిగానే ఇకనుంచి మరిన్ని నోటిఫికేషన్లు రానున్నాయి. దీంతో నిరుద్యోగ యువత కూడా కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. కొలువుల సాధనే లక్ష్యంగా గ్రంథాలయల్లో పోటీ పరీక్షల పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఇందుకు అనుగుణంగా ‘నమస్తే తెలంగాణ’ కూడా ఇప్పటికే ‘నిపుణ’ను ప్రచురిస్తోంది. ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన అన్ని అంశాలను పొంది పరిచి అందిస్తోంది.
పుస్తకాలతో కుస్తీలు..
అర్హులైన నిరుద్యోగ యువతీయువకులు ప్రిపరేషన్లో మునిగితేలుతున్నారు. ఏ లైబ్రరీకి వెళ్లినా, ఏ ఇంట్లో చూసినా.. పుస్తకాల పురుగులైన కన్పిస్తున్నారు. గ్రూప్ – 1, 2, 3, 4తో పాటు విద్య, యూనిఫాం సర్వీస్ శాఖల్లోనూ ఖాళీల భర్తీకి ఏర్పాట్లు జరుగుతుండడంతో ఆ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు. మరోవైపు పోలీస్ శాఖ, ప్రభుత్వ విభాగాలు ఉచిత శిక్షణ కేంద్రాల నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గాల్లో కోచింగ్ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు.
నౌకరీలు భర్తీకి త్వరలో జాబ్ క్యాలండర్
సర్కారు కొలువుల భర్తీకి ప్రత్యేక క్యాలెండర్ ఏర్పాటుకు కూడా సర్కారు సన్నద్ధమ వుతోంది. ఏటా ఏర్పడే ఖాళీలను క్రమం తప్పకుండా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోనుంది. అన్నింటినీ ఒకేసారి జారీ చేయకుండా నోటిఫికేషన్లకు మధ్య తగు వ్యవధిని పాటించేలా చర్యలు తీసుకోనున్నారు.
జిల్లా, జోనల్ పోస్టులు మన వాళ్లకే..
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 1,316 జిల్లా స్థాయి పోస్టులు, జోనల్ స్థాయిలో 2,160 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇవన్నీ స్థానికులకే దక్కే అవకాశం ఉంది. వీటిల్లో ఎలాగైనా కొలువు సాధించాలనే లక్ష్యంతో ఇప్పటికే కొందరు యువతీయువకులు హైదరాబాద్, ఖమ్మం, కొత్తగూడెం లాంటి పట్టణాల్లోని శిక్షణ కేంద్రాల్లో చేరుతున్నారు. మరికొందరు పోటీ పరీక్షల మెటీరియల్ సేకరించి ప్రిపరేషన్ మొదలు పెట్టారు. స్థానికతకు పెద్దపీట వేయడం, వయో పరిమితి పెంచడంతో ఈసారి తీవ్ర పోటీ నెలకొంది.
‘నమస్తేలో నిపుణ’
కొలువు సాధించాలంటే ప్రాక్టీస్ ఉండాలి. మంచి ప్యాకల్టీ ఎంతో అవసరం. దీంతోపాటు కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్ వంటి చాలా ముఖ్యం. ఇందుకోసం ‘నమస్తే తెలంగాణ’ సైతం నిరుద్యోగులకు బాసటగా నిలుస్తోంది. ‘నిపుణ’ సంచిక ద్వారా ప్రతి రోజూ నాలుగు పేజీలు స్టడీ మెటీరియల్ అందిస్తోంది. పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలో, ఏయే అంశాల్లో నైపుణ్యం పెంచుకోవాలో నిశితంగా తెలియజేస్తోంది.
జోనల్ పోస్టులూ దక్కించుకోవచ్చు..
జల్లా క్యాడర్‌నే కాకుండా జోనల్ పోస్టులు కూడా దక్కించుకునే అవకాశం ఉంది. గతంలో పెద్ద జోన్ ఉండేది ఇప్పుడు చిన్న జిల్లాల స్థాయిలోనే జోన్ ఏర్పాటైంది. కాబట్టి మంచి జాబ్‌లు యువతకు దక్కే చాన్స్ ఉంది. తెలంగాణ వచ్చాక ఇప్పటికే చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. దీంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరిస్తున్నారు.
–కొక్కుల కరుణ్‌కుమార్, కొత్తగూడెం
స్టడీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం..
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఇంత పెద్ద మొత్తంలో నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వాలను గతంలోనే ఎన్నడూ చూడలేదు. ఏది చేసినా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయేలా చేస్తారు. ఈ సారి తెలుగు సంవత్సరాది తెలంగాణ నిరుద్యోగులకు పెద్ద పండగే అని చెప్పాలి. వారి కోసం ప్రభుత్వం తరఫున స్టడీ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవచ్చు.
–రేగా కాంతారావు, ప్రభుత్వ విప్