ఖమ్మం/ రఘునాథపాలెం, ఏప్రిల్ 3: ఎలాంటి ఇబ్బందులూ లేకుండా, అన్ని సౌకర్యాలతో మనిషి ఆఖరి మజిలీ జరగాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. అందుకే ఊరూరా వైకుంఠధామాల నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఖమ్మం అల్లీపురంలో రెండెకరాల విస్తీర్ణంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టే వైకుంఠధామానికి ఆదివారం అయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో మనిషి చనిపోతే ఆఖరి మజిలీకి కనీసం స్థలం లేకుండా పోయేదని, గ్రామాల్లో మనిషి దహన సంస్కారాలకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారని అన్నారు. ప్రతి గ్రామంలోనూ ఇలాంటి సమస్యలను గుర్తించిన సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రభుత్వంలో గ్రామగ్రామానా వైకుంఠధామాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు.
అంతేగాక వాటిల్లో అన్ని సౌకర్యాలనూ సమకూర్చుతున్నట్లు వివరించారు. అదే క్రమంలో అల్లీపురంలో రూ.2 కోట్లతో వైకుంఠధామం నిర్మిస్తున్నట్లు చెప్పారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్లు రావూరి కరుణ, కమర్తపు మురళి, నాగండ్ల కోటేశ్వరరావు, ఆంద్రాబ్యాంక్ సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్రారెడ్డి, రైతుబంధు సమితి ఖమ్మం అర్బన్ కన్వీనర్ సంక్రాంతి నాగేశ్వరరావు, నాయకులు రావూరి సైదుబాబు, మొర్రిమేకల కోటయ్య, ముప్పారపు ఉపేందర్, సామినేని రాంబాబు, సత్తి గోపాలరావు, బొమ్మిశెట్టి లక్ష్మీనర్సయ్య, పగడాల మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ తరహాలో కేఎంసీ భవనం..
ఖమ్మం నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు 4 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో రూ.22 కోట్లతో నిర్మించిన కేఎంసీ నూతన భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. మేయర్ నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆదివారం ఆయన కేఎంసీ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే తరాలకు దాదాపు 30 ఏళ్లకు సరిపడా సకల వసతులతో కార్యాలయాన్ని తీర్చిదిద్దినట్లు చెప్పారు. ప్రత్యేక డిజైన్‌తో ఉద్యోగులు, ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మూడోఫ్లోర్‌లో క్యాంటీన్ సౌకర్యం కల్పించామన్నారు.
సుమారు 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న ఈ కార్యాలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. ఫినిషింగ్ పనులను కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లిఫ్ట్, రిసెప్షన్ కౌంటర్, ఇంజినీరింగ్, మీ సేవా, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, కౌన్సిల్ హాల్ విభాగాలను పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, నాగండ్ల కోటేశ్వరరావు, బుడిగెం శ్రీనివాసరావు, టీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, నాగచంద్రారెడ్డి, జశ్వంత్, తహసీల్దార్ శైలజ పాల్గొన్నారు.