భద్రాచలం, ఏప్రిల్ 3: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 10న స్వామివారి కల్యాణం, 11న మహా పట్టాభిషేకం ఉత్సవాలను మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను వీక్షించే భక్తుల కోసం సెక్టార్ల టిక్కెట్లను సోమవారం నుంచి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించనున్నట్లు దేవస్థానం ఈవో శివాజీ ఆదివారం తెలిపారు. దేవస్థానం కార్యాలయం (తానీషా కల్యాణ మండపం వద్ద)లో, ఆలయ రాజగోపురం ముందున్న మెయిన్ టికెట్ కౌంటర్లో, బ్రిడ్జి పాయింట్ వద్ద ఉన్న సీఆర్వో కౌంటర్లో, ఎస్బీఐ, ఆర్డీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని వివరించారు. రూ.2500పైన విలువ కలిగిన టికెట్లు కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలోనూ అందుబాటులో ఉంటాయని భద్రాచలం ఇన్చార్జి సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.