ఖమ్మం కల్చరల్, ఏప్రిల్ 2: శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రెండేళ్లుగా పండుగలకు దూరంగా ఉన్న ఉమ్మడి జిల్లా ప్రజలు.. ఈ ఏడాది శుభాల ‘శుభకృత్’ సంవత్సరం కావాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆలయాల్లో తమ ఇష్టదైవాలకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. చాన్నాళ్ల తరువాత ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ కనిపించాయి. తెలుగు సంవత్సరాదికి ప్రత్యేకమైన ఉగాది పచ్చడిని, తీరొక్క ప్రసాదాలను ఆలయ కమిటీలు తయారు చేసి భక్తులకు అందజేశాయి. అన్ని ఆలయాలూ ప్రత్యేక పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి అజయ్‌కుమార్ ఉగాది వేడుకలను నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లోని ప్రముఖ ఆలయాల్లో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, రాములునాయక్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు.
తెలుగింట పచ్చటి మామిడి తోరణాలు. శోభాయమానమైన రంగవల్లుల వాకిళ్లు. పంచాంగ శ్రవణాలు. షడ్రుచుల పచ్చడి.. వెరసి తెలుగు లోగిళ్ల తొలి పండుగ శ్రీశుభకృత్ నామ ఉగాది పర్వాన్ని శ్రీచైత్ర శుద్ధ పాఢ్యమి శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. తెల్లవారుజామున తైల అభ్యంగన స్నానాలు ఆచరించి, ఇళ్లను అలంకరించుకుని, ఆలయాలకు వెళ్లి తమ ఇష్ట దైవాలను దర్శించుకొని పూజలు చేశారు. ఆలయాల్లో వేద పండితులు నిర్వహించిన పంచాంగ శ్రవణంలో రాశి, నామ నక్షత్రాలను అనుసరించి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు, అవమానాలను తెలుసుకున్నారు. తీపి, ఉప్పు, చేదు, పులుపు, కారం, వగరులతో గల బెల్లం, వేపపువ్వు, చింతపండు, పచ్చి మామిడి ముక్కలు, మిరప పొడులతో ఆరు రుచుల ఉగాది పచ్చడిని తయారు చేసుకుని ప్రసాదంగా తీసుకున్నారు.
మరింత అభివృద్ధి పథంలో..
ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, వసంతలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. వేద పండితుడు తాటికొండాల సీతారామశాస్త్రితో శాస్ర్తోక్తంగా పూజలు చేయించారు. అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశితో గల మంత్రి అజయ్‌కుమార్‌కు ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు 14గా సమానంగా ఉన్నాయని, రాజపూజ్యం 3, అవమానం 1తో జిల్లాను మరింత ప్రగతి పథంలో తీసుకెళ్తారని పంచాంగ పఠనం చేశారు. ఖమ్మం జిల్లా నామం ప్రకారం ఆరుద్ర నక్షత్రం, మిథున రాశితో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం, అవమానం 2 సమానంగా ఉన్నాయని తెలిపారు. పంచాగ శ్రవణానికి హాజరైన ప్రముఖుల నామ, రాశి ఫలాలను అనుసరించి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలను తెలిపారు.
రాష్ట్రంలో సమర్థ పాలన: అజయ్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఏడేళ్లుగా జిల్లాలో ఎలాంటి కరువు కాటకాలూ లేవని మంత్రి అజయ్‌కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉందని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కూడా రాష్ట్రం, జిల్లా మరింత సుభిక్షంగా ఉంటాయని అన్నారు. పాడి పంటలు, సమృద్ధి వర్షాలతో సస్యశ్యామలంగా ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉండడంతో ఈ సంవత్సరం ఎన్నికలు ఉండవని, రాష్ట్ర పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని అన్నారు. నూతన తెలుగు సంవత్సరం సందర్భంగా తీసుకునే నిర్ణయంలో భాగంగా ఈ సంవత్సరం జిల్లా ప్రజలకు మరింత అందుబాటులో ఉండి మరింత సమయాన్ని కేటాయిస్తానన్నారు.
సీతారామ ప్రాజెక్టు ద్వారా మరింత సాగు పెరుగుతుందని, వచ్చే ఏడాదికి ఖమ్మంలో మెడికల్ కళాశాల ఏర్పాటవుతుందని అన్నారు. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ గోపురానికి ఖమ్మం జిల్లా ప్రజల తరఫున కిలో బంగారాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఖమ్మం స్తంభాద్రి ఆలయ అభివృద్ధికీ కృషి చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడి, ప్రసాదాన్ని మంత్రి చేతుల మీదుగా అందరికీ అందజేశారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వర్ణభారతి కల్యాణ మండపంలో నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మంత్రి అజయ్‌కుమార్ ప్రసంగించారు.
భద్రాద్రి జిల్లాకు మంచి గుర్తింపు
కొత్తగూడెం కల్చరల్, మార్చి 2: ఉగాది పర్వదినాన జిల్లా కేంద్రంలో గణేశ్ టెంపుల్లో ప్రధాన అర్చకుడు రాధాకృష్ణ శర్మ పంచాగ శ్రవణం చేశారు. ముందుగా భద్రాద్రి కొత్తగూడెం పేరుతో పంచాంగం చూసి జిల్లా అభివృద్ధి ఎలా ఉండబోతుందో చదివి వినిపించారు. జిల్లాకు ఖర్చు ఎక్కువగా ఉన్నా పేరు ప్రతిష్ఠలు మాత్రం అన్నిటికన్నా ముందు వరుసలో ఉంటాయన్నారు. వ్యవసాయపరంగా రైతులకు ఈ ఏడాది లాభసాటిగా ఉండబోతుందని చెప్పారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు జిల్లాకు మంచి పేరు తెచ్చిపెట్టబోతున్నాయని అన్నారు. అధిక వర్షాలు ఉన్నాయని, రైతులకు ఉపయోగకరంగా ఉండబోతుందని చెప్పారు.