కనిపించిన నెలవంక
ప్రారంభమైన ఉపవాస దీక్షలు
ముస్లింల ళ్లల్లో సందడి
రామవరం, ఏప్రిల్ 2 : నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించినట్లు మర్కజి రూయత్ ఇ హిలాల్ కమిటీ సదర్ మజ్లీస్ ఉల్మా ఈ డక్కన్ కమిటీ ప్రకటన జారీ చేసింది. దీంతో ఖమ్మం ఉమ్మడిజిల్లా పరిధిలో మసీదుల్లో సైరన్లు మోగించారు. ఒకరికి ఒకరు చాంద్ ముబారక్(నెలవంక) దర్శనం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ మాసంలో ఇషా నమాజ్ తరువాత చేసే ప్రత్యేక తరవీహ్ నమజ్ ప్రారంభంకావడంతో ముస్లింల ఇళ్లలో రంజాన్ సందడి మొదలైంది. ఆదివారం సహర్‌తో ఉపవాసాలు(రోజా) ప్రారంభమయ్యాయి. అందుకోసం తిను పదార్థాలను నిల్వ చేసుకున్నారు. రంజాన్ మాసం 30వ రోజు ఉపవాస చివరి రోజున షవ్వాల్ మాసం నెలవంకను చూసి తెల్లవారాక ఈద్-ఉల్ -ఫిత్(్రరంజాన్) పండుగను జరుపుకోనున్నారు. గత రెండు సంవత్సరాలుగా కొవిడ్ నిబంధనలను అనుసరించి మసీదులలో భౌతికదూరం పాటిస్తూ నమాజ్‌ను ఆచరించారు. ప్రస్తుతం కొవిడ్ వ్యాప్తి తగ్గడంతో యథావిధిగా నమాజ్‌లు, ఇఫ్తార్లు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు.
నాలుగో మూలస్తంభం ఉపవాసం(రోజా)
ఇస్లాం నాలుగవ మూల స్తంభం ఉపవాసం. ఉపవాసాన్ని అరబ్బి భాష ఇస్లాం ధర్మశాస్త్ర పరిభాషలో ‘సౌమ్’ అంటారు. ఉపవాసం అంటే అలాహ్ ప్రసన్నత కోసం అల్లా ఆరాధన ఉద్దేశంతో ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నపానాలకు దూరంగా ఉండడంతోపాటు ఉపవాసాన్ని భంగపర్చే కార్యాలన్నింటికీ దూరంగా ఉండడం ముస్లింలకు ఫర్జ్(విధి)గా నిర్ణయించబడింది. ధర్మపరమైన కారణాలు లేకుండా ఉపవాసాలు పాటించనైట్లెతే అతను ఫాసిఖ్ దురాచారి అవుతాడని హదీస్ ద్వారా చెప్పబడింది.