భద్రాద్రి కలెక్టర్‌కు చేరిన లబ్ధిదారుల జాబితా
మరో వారంలో లబ్ధిదారుల ఖాతాల్లోకి సాయం
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): దళిత సాధికారత, ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకానికి సంబంధించి భద్రాద్రి జిల్లాలో మొదటి విడత లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఆ జాబితా కలెక్టర్ అనుదీప్‌కు చేరింది. జిల్లా మొతానికి 461 యూనిట్లు మంజూరు కాగా.. ఐదుగురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల నుంచి 361 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. భద్రాచలం నియోజకవర్గం నుంచి కొంతమంది ఎంపిక కావాల్సి ఉంది. తొలి జాబితాలో ఉన్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో మరో వారం రోజుల్లో ఆర్థిక సాయం జమ కానుంది. ఇందుకు సంబంధించిన నిధులు ఇప్పటికే కలెక్టర్ ఖాతాలో ఉన్నాయి. అయితే, లబ్ధిదారులు ఎంచుకునే యూనిట్లపై ఆయా నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు వారికి అవగాహన కల్పిస్తున్నారు.
చరిత్రలో నిలిచిపోయేలా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం భద్రాద్రి జిల్లాలోని దళితుల జీవితాల్లో వెలుగులు నింపబోతోంది. మొన్నటి వరకు కూలి పనులకు వెళ్లిన ఆయా కుటుంబాలకు త్వరలోనే ఆర్థిక భరోసా లభించనుంది. దళితబంధు మంజూరుతో వారి మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వంద శాతం సబ్సిడీతో మంజూరయ్యే ఈ ఆర్థిక సాయాన్ని అందించేందుకు తొలి విడతలో ప్రతి నియోజకవర్గం నుంచి వందమందిని ఎంపిక చేశారు. నచ్చిన యూనిట్ల గురించి తెలుసుకొని వాటిపై వారికి అవగాహన కల్పిస్తారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన లబ్ధిదారుల జాబితా.. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముత్యం పరిశీలన అనంతరం కలెక్టర్‌కు చేరింది. జిల్లాలో ఐదు నియోజకవర్గాలతోపాటు వైరా నియోజకవర్గంలో ఉన్న జూలూరుపాడు మండలం నుంచి కూడా 17 మందిని ఎంపిక చేశారు. ఐదు నియోజకవర్గాల్లో కొత్తగూడెం నుంచి 100 మందిని, భద్రాచలం నుంచి 60 మందిని, అశ్వారావుపేట నుంచి 100 మందిని, పినపాక నుంచి 100 మందిని, ఇల్లెందు నుంచి 44 మందిని ఎంపిక చేశారు. ఇప్పటి వరకు 361 మందిని మాత్రమే ఎంపిక చేశారు. భద్రాచలం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో ఎంపికలు జరగాల్సి ఉంది.
39,000 దళిత కుటుంబాలు..
జిల్లా వ్యాప్తంగా 39,000 దళిత కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెండో విడత ఎంపికల్లో వారందరికీ దళితబంధు పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఇప్పటి వరకు కూలి పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీసుకుంటున్న దళిత కుటుంబాల్లో ఈ పథకం భరోసా నింపనుంది.
వారం రోజుల్లో ఖాతాల్లోకి సాయం..
జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసిన కలెక్టర్ అనుదీప్ మండల స్థాయిలో కూడా లబ్ధిదారుల సమావేశాలు ఏర్పాటు చేయించడంతో వారికి అవసరమైన యూనిట్లను మాత్రమే ఎంపిక చేసుకున్నారు. ఎవరైతే ఆయా పనుల్లో నిమగ్నమై పనులు చేసుకుంటున్నారో వారికి లబ్ధి చేకూరే విధంగా యూనిట్లను ఎంపిక చేశారు. మొదటి విడతలో ఎంపికైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో మరో వారం రోజుల్లో ఆర్థిక సాయం జమకానుంది. మొదటగా యూనిట్ నెలకొల్పడానికి ఎంత సొమ్ము అవసరమో అంత మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటికే మంజూరైన సాయం కలెక్టర్ ఖాతాలో ఉంది.
అవగాహన కల్పించి..
కలెక్టర్ పర్యవేక్షణలో ప్రతి నియోజకవర్గానికీ ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. మొదటి విడతలో ఎంపికైన వారికి వారి ద్వారా అవగాహన కల్పించారు. భద్రాచలానికి జిల్లా కో ఆపరేటివ్ అధికారి వెంకటేశ్వర్లు, పినపాకకు ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, కొత్తగూడేనికి డీఆర్డీవో మధుసూదనరాజు, ఇల్లెందుకు జిల్లా ఉద్యాన శాఖ అధికారి మరియన్న, అశ్వారావుపేటకు పరిశ్రమల శాఖ అధికారి సీతారాంనాయక్, జూలూరుపాడుకు ఈఈ ఆర్అండ్బీ బీమ్లాను ప్రత్యేకాధికారులుగా నియమించారు. వీరి పర్యవేక్షణలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. మొదటి విడతలో భద్రాద్రి జిల్లాకు 421 యూనిట్లు మంజూరయ్యాయి. కానీ 361 మంది లబ్ధిదారులు మాత్రమే ఎంపికయ్యారు.
అవగాహన కల్పిస్తున్నాం..
కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాం. అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులు సమావేశాలు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ల వల్ల ఎంత వరకు ప్రయోజనం ఉంటుందనే అంశంపై పరిశీలన చేశాం. ఆదాయ వనరులుగా ఉండే యూనిట్లను మాత్రమే ఎంపిక చేసుకోవాలని చెప్పాం. వచ్చే వారంలో లబ్ధిదారుల ఖాతాల్లో సాయం సొమ్ము జమ అవుతుంది.
– ముత్యం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, భద్రాద్రి