ఖమ్మం కల్చరల్/ కొత్తగూడెం కల్చరల్, ఏప్రిల్ 1:ప్రకృతిలోని చెట్లన్నీ అలంకరించినట్లు, కొత్త చిగుర్లతో పచ్చని స్వాగత ద్వారాలు.. లేలేత మామిడి చిగుళ్లు… కోకిల రాగాల సరాగం.. రేరాజు వెలుగుల రేడుగా విరాజిల్లే శుభకాలం.. జీవితానుభూతుల ప్రతీకగా ఆరు రుచుల పచ్చడి.. ప్రకృతి కాంత కొత్త సింగారాలతో హొయలొలికే వసంతం.. రాజ్యపూజ్యాలను తెలిపే పంచాంగ శ్రవణం.. వెరసి శ్రీశుభకృత్ నామ సంవత్సరాదిగా అడుగుపెడుతున్నది.. శ్రీచైత్రశుద్ధ పాడ్యమి శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెలుగు లోగిళ్ల తొలి పండుగ ఉగాదిని ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఇండ్లన్నీ మామిడి తోరణాలు, రంగవల్లులతో వాకిళ్లను శోభాయమానంగా అలంకరిస్తున్నారు.
నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శ్రీశుభకృత్ నామంతో ఆరంభమైంది. అన్నదాతలు, యువతీయువకులు, విద్యార్థులు, కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు తమ కొత్త ఆశలు, ఆశయాలతో ఈ నూతన వత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ప్రధానంగా తెలంగాణలో ఈ శుభకృత్ నిరుద్యోగులకు వేలాది ఉద్యోగాలతో శుభాలు తీసుకురానుంది. ఈ మేరకు మంచి ఆశావహ దృక్పథంతో, లక్ష్యంతో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. రెండేళ్లుగా అన్నింటా కాటేసిన కరోనా మహమ్మారి ఛాయల నుంచి బయటపడిన అన్ని వర్గాల ప్రజలు.. ఈ నూతన సంవత్సరం సకల శుభాలు తీసుకొస్తొందనే ఆశతో ఉన్నారు. కొవిడ్ నేర్పిన పాఠాలు, అనుభవాలతో ఆర్థిక సంబంధాల కన్నా మానవ సంబంధాల ప్రాధాన్యంపై దృష్టి పెట్టారు. యువత మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సుభిక్ష సమాజాన్ని తీర్చిదిద్దాల్సి ఉంది.
ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్‌మీడియా వేదికలకు బానిస కాకుండా తమ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులు అకడమిక్ చదువులతోపాటు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలి. రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం సమైక్యంగా పనిచేయాలి. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమానికే అంకితమయ్యే రాజకీయ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలి. ఉద్యోగులు మరింంత నిబద్ధతతో విధులు నిర్వర్తించి వృత్తికి పునరంకితం కావాలి. ప్రతి ఒక్కరూ తమ రంగాల్లో నీతి, నిజాయితీ, సామాజిక స్పృహతో నూతనత్వంతో వినూత్న సృజనతో ముందుకుసాగాలి. కవులు, రచయితలు, గాయకులు, కళాకారులు సామాజిక బాధ్యతగా తమ సృజనను మరింత వెలికితీయాలి. అప్పుడే ఈ శ్రీశుభకృత్ ఉత్తమ ఫలితాలను అందించి శుభ సంపదను పంచి పెడుతుంది.
ఉట్టిపడిన తెలుగుతనం…
మామిడికాయలు, వేపపూత, సంప్రదాయ వస్త్రధారణలతో చిన్నారులు ఉగాది పర్వదినాన్ని ముందుగానే తీసుకొచ్చారు. నగరంలోని స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శుక్రవారం ఉగాది వేడుకలను నిర్వహించారు. సంప్రదాయ వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య ఆధ్వర్యంలో చిన్నారులు ఉగాది పచ్చడిని తయారు చేసి, షడ్రుచుల పచ్చడిని ప్రసాదంగా తీసుకున్నారు.
ఉత్తమ సేవలందించాలి..
శ్రీశుభకృత్ తెలుగు సంవత్సరం మంచి ఫలితాలు, శుభాలు కలుగజేయాలనేదే అందరి ఆకాంక్ష. ప్రతి ఒక్కరూ తమ తమ రంగాల్లో ఉత్తమ సేవలందించాలి. నిబద్ధత, క్రమశిక్షణతో జీవన విధానం మెరుగుపర్చుకోవాలి. తలసేమియా బాధిత చిన్నారులకు నా వంతు బాధ్యతగా సహాయం చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళిక చేసుకుంటా. ప్రతి ఒక్కరూ మానవ సంబంధాలు, విలువలతో జీవిస్తేనే జీవితానికి సార్థకత ఉంటుంది. -డాక్టర్ కూరపాటి ప్రదీప్, ఖమ్మం
సాయంత్రం షడ్వాహన సేవ..
ఉగాది.. తెలుగు వారి నూతన సంవత్సరం. ఈ ఏడాది శ్రీ శుభకృత్ నామ సంవత్సరంగా పిలవబడుతుంది. శనివారం తెల్లవారు జామున నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం 10:30 గంటలకు పంచాంగ శ్రవణం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు షడ్వాహన సేవ ఉంటుంది.
–కొడమంచిలి రాధాకృష్ణ శర్మ, గణేశ్ టెంపుల్, కొత్తగూడెం
జిల్లా ఆదాయం 11, వ్యయం 5
ఖమ్మం జిల్లా నామ నక్షత్రాన్ని అనుసరించి ఆరుద్ర నక్షత్రం, మిధున రాశి కావడం వల్ల జిల్లా ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2గా ఉంటాయి. అన్ని రంగాల్లో జిల్లా ఉత్తమ స్థానంలో ఉంటుంది. ఈ సంవత్సరం చైత్ర, వైశాఖాల్లో ఎండలు బాగా ఉంటాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశిలో ఆదాయం 14, వ్యయం 14తో రాజపూజ్యం 3, అవమానం 1తో జిల్లాను మరింత ప్రగతిపథంలోకి తీసుకెళ్లనున్నారు.
–తాటికొండాల సీతారామశాస్త్రి, జ్యోతిష్య శాస్త్ర పండితుడు