భద్రాచలం, ఏప్రిల్ 1: భద్రగిరిలో ఆధ్యాత్మిక వైభవం పరిఢవిల్లుతున్నది. విద్యుత్ కాంతులతో సరికొత్త శోభను సంతరించుకున్నది. కొవిడ్ కారణంగా రెండేళ్లపాటు ఆంతరంగికంగానే సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో భక్తజన సందోహం మధ్య వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శనివారం వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని ఆలయ అధికారులు రామాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో శనివారం నుంచి వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. శుభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని బ్రహ్మోత్సవాల సందర్భంగా రామాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామాలయం పరిసర ప్రాంతాల్లో, ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, చాందినీ వస్ర్తాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. విద్యుత్ దీప కాంతులతో పట్టణమంతా అధ్యాత్మిక శోభ ఉట్టి పడుతోంది. బ్రహ్మోత్సవాల తొలిరోజున శనివారం ఆలయంలో వేపపూత ప్రసాదం (ఉగాది పచ్చడి) ఉదయం నుంచి సాయంత్రం వరకు పంపిణీ చేయనున్నారు.
ఉదయం ఉత్సవమూర్తులు, నిత్యకల్యాణమూర్తులకు, లక్ష్మీ తాయారమ్మవారికి, భక్త రామదాసుకు, ఆండాళ్ తల్లికి, కణ్డన్, ఉత్సవారంభ స్నపనం, అంతరాలయంలోని మూలవరులకు పంచామృతాలతో అభిషేకం జరుపనున్నారు. సాయంత్రం4:30 సాయంకాలం ఆరాధన, 6 గంటలకు దర్బారు సేవ పూర్తి చేస్తారు. అప్పటి నుంచి 8 గంటల వరకు నూతన పంచాంగాలకు విశ్వక్సేన ఆరాధన, కర్మణః పుణ్యాహవాచన, అష్టదిక్పాలక ఆవాహన, సరస్వతి పూజ, లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన, పసుపు, కుంకుమలతో పూజ నిర్వహిస్తారు. అనంతరం వేద పండితులు చెన్నావఝల వెంకటేశ్వర అవధానితో నూతన పంచాంగ శ్రవణం ఉంటుంది.
రామయ్యది పునర్వసు నక్షత్రం కాబట్టి ఆదాయ, వ్యయాలు, సీతమ్మ ఆదాయ, వ్యయాలు వివరిస్తారు. అనంతరం 12 మంది వేద పండితులకు మహదాశీర్వచనం జరిపించనున్నారు. ఆలయ అధికారులు వేద పండితులు, అర్చకులకు కొబ్బరిబొండాలు, నూతన పంచాంగాలు, పరిషద్రక్షిణ సమర్పిస్తారు. ఈ రోజు నుంచి తిరువీధి సేవలు ప్రారంభమవుతాయి. దివ్యక్షేత్రంలో శనివారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో స్వామివారికి జరిపే నిత్య కల్యాణాలను ఏప్రిల్ 16 వరకు నిలిపివేయనున్నట్లు దేవస్థానం ఈవో శివాజీ తెలిపారు.
భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు : కలెక్టర్ అనుదీప్
భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు ఉండాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రామయ్య కల్యాణం నిర్వహించే మిథిలా స్టేడియం, స్నానాల రేవు, గోదావరి కరకట్ట, భద్రాచలం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం, ఇతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు వసతి, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. టిక్కెట్ లేని భక్తులను సెక్టార్లలోకి అనుమతించొద్దని పేర్కొన్నారు. ఆలయంలో భక్తులు సులభంగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు ప్రత్యేక విధులు కేటాయించాలన్నారు.
పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు గోదారిలోకి వెళ్తారని, లోతుగా ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. సాయంత్రం 6 తరువాత ఎవరినీ గోదావరిలోకి అనుమతించవద్దని చెప్పారు. గోదావరి తీరంలో గజఈతగాళ్లు, పడవలను సిద్ధంగా చేయాలన్నారు. నవమి రోజున భక్తులు రామయ్య కల్యాణాన్ని వీక్షించేందుకు సెక్టార్లలో ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు రామయ్య తలంబ్రాలు అందించేందుకు 60 కౌంటర్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డీపీవో రమాకాంత్, డీఆర్డీవో మధుసూదనరాజు, ఆర్అండ్బీ ఈఈ భీమ్లా, సీఎల్వో చంద్రప్రకాశ్, దేవస్థానం డీఈ రవీందర్, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
మంత్రి పువ్వాడ అజయ్‌కు ఆహ్వానం
ఖమ్మం ఏప్రిల్ 01 : భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో 10వ తేదీన రాములోరి కల్యాణ మహోత్సవానికి రావాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం ఖమ్మంలోని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ క్యాంపు కార్యాలయంలో భద్రాద్రి ఆలయ ఈవో, దేవాలయ కమిటీ ప్రతినిధులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వేదపండితులు శేషవస్త్రం కప్పి స్వామివారి ప్రతిమను అందజేశారు.