ఖమ్మం, ఏప్రిల్ 1: శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలానికి 400 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఖమ్మం బస్టాండ్‌ను శుక్రవారం రాత్రి ఆయన తనిఖీ చేశారు. సుమారు రెండు గంటలు పర్యటించి వసతులను పరిశీలించారు. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్‌లో వేచి ఉన్న ప్రయాణికులతో మాట్లాడారు. ఏ ఊరికి వెళ్తున్నారని, సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. కోదాడ వెళ్లే బస్సు ఎక్కి ప్రయాణికులతో ముచ్చటించారు. బస్టాండ్‌లోని మెడికల్ షాపులో వాటర్ బాటిళ్లను పరిశీలించి లేబుల్‌ను స్కాన్ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఖమ్మంలో విశాలమైన స్థలంలో అన్ని వసతులతో ఆధునిక బస్టాండ్‌ను నిర్మించేందుకు కృషిచేసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఖమ్మం బస్టాండ్ రాష్ర్టానికే రోల్ మోడల్‌గా ఉందన్నారు. ఉగాది సందర్భంగా సంస్థ కొన్ని సౌకర్యాలను కల్పిస్తోందన్నారు. 65 ఏళ్లు పైబడిన ప్రయాణికులకు ఈ రోజున ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. శ్రీరామనవమి తలంబ్రాలను తెప్పించుకోవడానికి ఏర్పాట్లు చేశామన్నారు.
రూ.80 చెల్లిస్తే స్వామివారి తలంబ్రాలను ఇంటికి తెచ్చి ఇస్తామన్నారు. యాదాద్రి లక్షీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఏ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునేలా రానున్న రోజుల్లో మరింత సాంకేతికతను జోడించేందుకు కృషి చేస్తామన్నారు. కొవిడ్, డీజిల్ ధరలు, విడిభాగాల ధరలు పెరగడంతో ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉందని, ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని అన్నారు. కార్గో సేవల ద్వారా గత ఏడాది రూ.100 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. శనివారం నాటికి ఖమ్మం బస్టాండ్ ప్రారంభించి ఏడాది అవుతుందన్నారు. ప్రయాణికులు చాలా సంతృప్తికరంగా ఉన్నారన్నారు.
ఈ సందర్భంగా మధిర వెళ్లేందుకు వేచి ఉన్న ఉదయప్రియ అనే ప్రయాణికురాలితో మాట్లాడారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడుగగా.. చాలా బాగున్నాయని ఆమె సమాధానమిచ్చారు. భద్రాచలం వెళ్లే శివ అనే ప్రయాణికుడిని పలుకరించగా.. తాను రెండు గంటల నుంచి వేచి ఉన్నానని, ఇంత వరకు బస్సురాలేదని చెప్పాడు. వెంటనే స్సందించిన ఎండీ.. 10 నిమిషాల్లో బస్సు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కోదాడకు వెళ్లే బస్సు ఎక్కి 10 నిమిషాల పాటు ప్రయాణికులతో మాట్లాడారు. ఆర్ఎం ప్రభులత, డీవీఎం భవానీ ప్రసాద్, డీఎం శంకర్రావు, వైద్యుడు గిరిసింహారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం సజ్జనార్.. మంత్రి అజయ్‌ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.