పర్ణశాల, ఏప్రిల్ 1: పవిత్ర పుణ్యక్షేత్రమైన పర్ణశాలలో ఈనెల 10న జరిగే శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవానికి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని రంగులతో అలంకరిస్తూ పంచవటిని అందంగా ముస్తాబు చేశారు. భక్తులు అధికసంఖ్యలో వస్తారనే ఆలోచనతో సకల సౌకర్యాలూ సమకూరుస్తున్నారు. భక్తులకు స్వాగతం పలికేందుకు ముఖద్వారం వద్ద ప్రధాన ద్వారాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఆలయానికి నాలుగు వైపులా గోపురాలకు రంగులు తీర్చిదిద్ది విద్యుద్ధ్దీకరణ పనులు చేపట్టారు. పంచాయతీ అధికారులు కూడా నవమి ఏర్పాట్లను నిర్వహించేందుకు పనులు చేపట్టారు. గోదావరి తీరం వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానాల గదులను ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. భద్రాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీడీవో చంద్రమౌళి, సర్పంచ్ వరలక్ష్మి, ఎంపీవో ముత్యాలరావు, కార్యదర్శి ప్రసాదరెడ్డి తెలిపారు.
సువర్ణమూర్తుల వితరణ
భద్రాచలం, ఏప్రిల్ 1: భద్రాద్రి సీతారామచంద్రస్వామివారికి హైదరాబాద్కు చెందిన శంకర్, రాధారాణి దంపతులు రూ.7.50 లక్షల విలువైన 115 గ్రాముల బంగారు కోదండరామమూర్తులను దేవస్థానానికి వితరణగా సమర్పించారు. శుక్రవారం రామాలయానికి విచ్చేసిన వారు.. ముందుగా అంతరాలయంలో మూలమూర్తుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తాము రామయ్యపై భక్తితో తయారు చేయించిన బంగారు సీతారామ, లక్ష్మణుల మూర్తులను దేవస్థానం ఈవో శివాజీకి అందించారు. ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, సూపరింటెండెంట్ కత్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మానికి చెందిన లక్ష్మీరాజ్యం 361 గ్రాములతో తయారు చేయించిన సుమారు రూ.31,398 విలువైన వెండి పళ్లేన్ని వితరణగా అందజేశారు. రామయ్యకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తరువాత దేవస్థానం ఈవోకు ఆ వెండి పళ్లేన్ని అందజేశారు.