రాములోరి కల్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా శ్రీరామనవమి ఉత్సవాలు ఆలయంలో అంతరంగికంగానే జరిగాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ సారి సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని మిథిలా స్టేడియంలో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు భారీగా తరలొచ్చే అవకాశం ఉండడంతో పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 2వ తేదీన వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 10న శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం, 11న మహాపట్టాభిషేకం జరుగనున్నది. వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను పర్యవేక్షకులుగా నియమించారు. భక్తులకు అనుగుణంగా ఆలయ అధికారులు 170 క్వింటాళ్ల తలంబ్రాలు, 2 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. తలంబ్రాలకు 50 కౌంటర్లు, లడ్డూలకు 30 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. రూ .కోటితో షామియానాలు, స్వాగత తోరణాలు, విద్యుత్ దీపాల అలంకరణ, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు వసతులు కల్పిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 31 (నమస్తే తెలంగాణ): దక్షిణ అయోధ్యాపురి భద్రగిరి శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి ముస్తాబవుతున్నది. ఈ నెల 2వ తేదీన వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 10న శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం, 11న మహాపట్టాభిషేకం జరుగనున్నది. స్వామికి కల్యాణ ఘడియలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆలయ అధికారులు చకాచకా వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్లు ఆలయంలో ఆంతరంగికంగా జరిగిన వేడుకలు ఈ సారి ఘనంగా జరుగనుండడంతో భక్తులు లక్షలాదిగా తరలిరానున్నారు. వేడుకల పర్యవేక్షణకు ఇప్పటికే కలెక్టర్ అనుదీప్ జిల్లాఅధికారులను పర్యవేక్షకులుగా నియమించారు.
ప్రముఖులకు అందుతున్న ఆహ్వానాలు..
హైదరాబాద్‌లో ఇటీవల రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శ్రీరామనవమి ఆహ్వాన పత్రికలు, వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఆలయ ఈవో శివాజీ మంత్రిని సత్కరించారు. శనివారం సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసైతోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆలయ అధికారులు శ్రీసీతారాముల కల్యాణ వేడుకలకు ఆహ్వాన పత్రికలు అందజేయనున్నారు. 11న జరిగే పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ తమిళిసై పర్యటన ఖరారు కాగా, ఇదే రోజు కేంద్ర మంత్రులూ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
పుణ్యక్షేత్ర మహత్యం ఇదీ..
త్రేతాయుగంలో దండకారణ్యంలో పర్ణశాల ప్రాంతంలో వనవాసం చేస్తున్న సీతారాములకు ఓ శిల ఆనందాన్ని కలిగించింది. ఆ దివ్యదంపతుల అనుగ్రహం పొందిన మేరు దేవి, మేరు పర్వత రాజదంపతులకు బ్రహ్మదేవుడి వరప్రసాదంతో పుత్రుడు జన్మించాడు. అతడే భద్రుడు. బాల్యం నుంచి శ్రీరామభ క్తుడైన భద్రుడు నారద మహర్షి ద్వారా శ్రీరామతారక మంత్రాన్ని ఉపదేశంగా పొంది, శ్రీరామ సాక్షాత్కారానికి దండకారణ్యంలో ఘోర తపస్సు చేశారు. తపస్సు ప్రభావంతో శ్రీమన్నారాయణుడు చతుర్భుజ రాముడిగా, శంఖుచక్ర ధనుర్బాణాలను ధరించి, ఎడమ తొడపై సీతాదేవి, వామ పార్శాన లక్ష్మణుడితో కుడి పార్శాన ఆశీనుడై ప్రత్యక్షమయ్యాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఇలా రాములోరి దర్శనం ఈ పుణ్యక్షేత్రంలోనే భక్తులకు లభించడం భద్రాచలం పుణ్యక్షేత్ర ప్రత్యేకత. అనంతరం భద్ర మహర్షి కోరికపై పర్వత రూపంగా మారిన శిఖరాగ్రంపై శ్రీపాదాలు నుంచి పవిత్ర గోదావరికి అభిముఖంగా ఆ భద్రుడి హృదయ స్థానాన వెలిశాడని, భద్రుడి కొండ అయినందున ఈ క్షేత్రానికి భద్రాచలం అని పేరువచ్చిందని పురాణగాథ.
ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం..
శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం శనివారం ఆలయ సన్నిధిలో పంచాంగ శ్రవణం, తిరువీధి సేవతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 16న చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజారోహణం, ద్వాదశ ప్రదక్షిణ, శ్రీపుష్పయాగంతో వేడుకలు ముగుస్తాయి. 6న ఉత్సవ మూర్తులకు విశేష స్నపనం, అంకురార్పణ, 7న గరుడ ధ్వజపట భద్రక మండల లేఖనం, గురుడాధివాసం, 8న అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, 9న ఎదుర్కోలు ఉత్సవం, 10న శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణ మహోత్సవం, 11న మహాపట్టాభిషేకం, రథోత్సవం జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 2వ తేదీ నుంచి 16 వరకు నిత్యకల్యాణాలు రద్దు చేసినట్లు, 6 నుంచి 16 వరకు దర్బార్ సేవలు, 6 నుంచి 23వ తేదీ వరుకు పవళింపు సేవలు రద్దు చేస్తామని ఆలయ అధికారులు ప్రకటించారు.
తలంబ్రాలు, లడ్డూలు సిద్ధం..
కొవిడ్ కారణంగా రెండేళ్లుగా శ్రీరామనవమి ఉత్సవాలు ఆలయంలో ఆంతరంగికంగానే జరిగాయి. ఈ సారి ఆలయం పరిధిలోని మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా జరుగునున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. వేడుకలకు వచ్చే భక్తులకు అనుగుణంగా ఆలయ అధికారులు 170 క్వింటాళ్ల తలంబ్రాలు, 2 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. తలంబ్రాలకు 50 కౌంటర్లు, లడ్డూలకు 30 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. రూ.కోటితో షామియానాలు, స్వాగత తోరణాలు, విద్యుత్ దీపాల అలంకరణ, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు వసతులు కల్పిస్తున్నారు.ఇప్పటికే ఆలయ ప్రాంగణం, చిత్రకూట మండపం వద్ద చలువ పందిళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయానికి విద్యుత్ దీపాలంకరణ ట్రయల్ రన్ పూర్తయింది. ప్రధాన కూడళ్లలో స్వాగత తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
రామయ్య ప్రసాదాలు ప్రియం
భద్రాచలం, మార్చి 31: భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం నుంచి రామయ్య ప్రసాదాలు ప్రియం కానున్నాయి. దేవస్థాన అధికారులు నిర్ణయించిన ధరలు ఇకపై అమలు కానున్నాయి. 100 గ్రాముల చిన్న లడ్డూ పాత ధర రూ.20 కాగా రూ.25కు, 200 గ్రాముల పులిహోర ప్యాకెట్ పాత ధర రూ.10 కాగా రూ.15కు, 100 గ్రాముల చక్కెర పొంగలి పాత ధర రూ.10 కాగా రూ.15కు పెరిగింది. 500 గ్రాముల మహా లడ్డూ పాత ధర రూ.100 కాగా లడ్డూను 400 గ్రాములకు కుదించి రూ.100కు ఖాయమైంది.
భక్తులకు అసౌకర్యం కలగొద్దు కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
భద్రాద్రి బ్రహ్మోత్సవాలను వీక్షించడానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని, అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశించారు. కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఎంపీవోలు, కార్యదర్శులతో పారిశుధ్య నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్ల తర్వాత వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వేడుకలకు లక్షలాది మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. భక్తులు ఎక్కువ సమయం భద్రాచలంలో గడిపే అవకాశం ఉందని, పట్టణంలో పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. గంట గంటకూ మరుగుదొడ్లను శుభ్రం చేయించాలన్నారు. పట్టణాన్ని 19 జోన్లుగా విభజించి ప్రతి జోన్‌కు ఒక ఎంపీవోను పర్యవేక్షణ అధికారిగా నియమించామన్నారు. వారు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. పర్ణశాలలో నాలుగు జోన్లు ఏర్పాటు చేశామని, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు 30 మంది కార్మికులను నియమించామన్నారు. సమావేశంలో డీపీవో రమాకాంత్, డీఆర్డీవో మధుసూదన్‌రాజు, డీఎల్పీవో హరిప్రసాద్ పాల్గొన్నారు.