కొత్తగూడెం సింగరేణి, మార్చి 31: సింగరేణి గత వార్షికోత్సవం కంటే 15 మిలియన్ టన్నుల అధికంగా బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం 2021-22లో 65 మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసింది. కొత్తగూడెం ఏరియా 141.91 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 131.23 లక్షల టన్నులు, ఇల్లెందు ఏరియా 50.38 లక్షల టన్నులకు 59.18 లక్షల టన్నులు, మణుగూరు ఏరియా 111.59 లక్షల టన్నులకు 119.17 లక్షల టన్నులు, ఆర్జీ-1 ఏరియా 31.79 లక్షల టన్నులకు 25.56 లక్షల టన్నులు, ఆర్జీ-2 ఏరియా 78.72 లక్షల టన్నులకు 84 లక్షల టన్నులు, ఆర్జీ-3 ఏరియా 61.25 లక్షల టన్నులకు 65.19 లక్షల టన్నులు, భూపాలపల్లి 44.70 లక్షల టన్నులకు 23.58 లక్షల టన్నులు, అడ్రియాలా ప్రాజెక్టు 31.99 లక్షల టన్నులకు 11.38 లక్షల టన్నులు, బెల్లంపల్లి ఏరియా 33.86 లక్షల టన్నులకు 24.25 లక్షల టన్నులు, మందమర్రి ఏరియా 51 లక్షల టన్నులకు 46.58 లక్షల టన్నులు, శ్రీరాంపూర్ ఏరియా 65.57 లక్షల టన్నులకు 62.81 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. 11 ఏరియాలు కలిపి 702.61 లక్షల టన్నులకు 645.07 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 92 శాతాన్ని నమోదు చేశాయి. ఇది గతేదాది కంటే 142 లక్షల టన్నులు ఎక్కువ. కరోనా, అధిక వర్షపాతం వంటి అడ్డంకులు వచ్చినా సంస్థను లక్ష్యానికి చేరువచేసిన అధికారులు, ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యం అభినందనలు తెలిపింది.
కొత్తగూడెం ఏరియాలో
రామవరం, మార్చి 31: సింగరేణి కొత్తగూడెం ఏరియాకు మార్చిలో నిర్దేశించిన 15.18 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 13.26 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 87 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిందని ఏరియా జీఎం నరసింహారావు అన్నారు. గురువారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక సంవత్సరంలో 142.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 131.64 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసి 92 శాతం ఉత్పత్తిని సాధించామన్నారు. ఇది సింగరేణి బొగ్గు ఉత్పత్తి మొత్తంలో 20 శాతమన్నారు. మార్చిలో రోడ్డు, రైల్ మార్గాల ద్వారా 11.74 లక్షల టన్నులు, ఆర్థిక సంవత్సరంలో 129.30 లక్షల టన్నులు రవాణా చేశామన్నారు. ఏరియాలో ఇప్పటివరకు 395 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశామన్నారు. సమావేశంలో ఎస్వోటూ జీఎం నారాయణరావు, ఏరియా ఇంజినీర్ రఘురామిరెడ్డి, ఏజీఎం సివిల్ సూర్యనారాయణ, డీజీఎంలు పర్సనల్ శామ్యూల్ సుధాకర్, వెంకటేశ్వర్లు, ఉజ్వల్‌కుమార్ బెహ్రా, సదానందం, రాజశేఖర్, క్వాలిటీ మేనేజర్ మదన్మోహన్ పాల్గొన్నారు.
మణుగూరు ఏరియాలో..
మణుగూరు రూరల్, మార్చి 31: సింగరేణి మణుగూరు ఏరియా మార్చిలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిలో 92శాతం సాధించిందని, 2021-22 వార్షిక 112 లక్షల టన్నుల లక్ష్యాన్ని అధిగమించి 119.49 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి, 156.4 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీశామని ఏరియా జీఎం జక్కం రమేశ్ తెలిపారు. గురువారం జీఎం కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆర్థిక సంవత్సర ముగింపునకు 24 రోజుల ముందుగానే లక్ష్యాన్ని సాధించామన్నారు. సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో ఏరియా వాటా 18.4శాతం ఉందన్నారు. పీకేవోసీ నుంచి ఏకంగా 100 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేశామని, ఇది యావత్ సింగరేణిలోనే రికార్డు అన్నారు. ఏరియాలో జియో థర్మల్ ప్లాంట్ పనులు పూర్తవుతున్నాయన్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఏరియాలో వివిధ గ్రేడుల్లో 318 మంది కార్మికులకు ప్రమోషన్లు ఇచ్చామన్నారు. సీఎస్ఆర్ కింద మణుగూరు అభివృద్ధికి రూ.18 కోట్లు అందించామన్నారు. 2022-23 వార్షిక లక్ష్యం 116 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు ఉద్యోగాలు, అధికారులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అధికారులు లలిత్‌కుమార్, నాగేశ్వరరావు, సలగల రమేశ్, వెంకట్రావ్, ఫిడ్జరాల్డ్, లక్ష్మీపతిగౌడ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నర్సిరెడ్డి, సురేశ్, మేరికుమారి, షబ్బీరుద్దీన్, వెంకటరమణ, సింగు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.