ఖమ్మం జడ్పీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం
పార్టీలకు ఆతీతంగా ఆమోదించిన సభ్యులు
తెలంగాణ రైతులపై కేంద్రానికి నిర్లక్ష్య ధోరణి
జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు
కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు
మామిళ్లగూడెం, మార్చి 30: తెలంగాణ రైతులు పండించే ప్రతి ధాన్యం గింజనూ కేంద్రమే కొనుగోలు చేయాలని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేరొన్నారు. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందింరలో బుధవారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేసేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందన్నారు. దేశంలో ధాన్యం పండించిన అన్ని రాష్ర్టాల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం.. తెలంగాణ ధాన్యం కొనే విషయంలో మాత్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. పంజాబ్లో వానకాలం ధాన్యాన్ని కొనుగోలు చేసిన కేంద్రం.. రెండో పంటగా వేసిన గోధుమలను సైతం కొనుగోలు చేస్తోందని అన్నారు.
కానీ తెలంగాణలో వానకాలంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం అనేక కొర్రీలు పెట్టిందని ఆరోపించారు. ఇప్పుడు యాసంగి ధాన్యం కొనుగోలు చేయకుండా తెలంగాణ రైతులపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, అమలు చేసిన పథకాల కారణంగా ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిందని స్పష్టం చేశారు. రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. రైతులకు న్యాయం జరిగే అంతవరకు కేంద్రంపై ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై వైరా ఎమ్మెల్యే రాములునాయక్, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, వైస్ చైర్మన్ ధనలక్ష్మి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.