దళితసాధికారత కోసమే దళితబంధు పథకం
సెక్టార్ల వారీగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి
పాడి పరిశ్రమ లబ్ధిదారుల శిక్షణలో ఖమ్మం కలెక్టర్
మామిళ్లగూడెం, మార్చి 30: దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ లబ్ధిదారులకు సూచించారు. చింతకాని మండలంలో దళితబంధు పథకంలో పాడి పరిశ్రమకు ఎంపికైన లబ్ధిదారులకు మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణ నగరంలోని డీపీఆర్సీ సమావేశ మందిరంలో బుధవారం ప్రారంభమైంది. ఈ శిక్షణలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. దళిత సాధికారత కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తోందన్నారు. లబ్ధిదారులు ఆసక్తి కనబర్చిన సెక్టార్లలో యూనిట్ల స్థాపన కోసం లబ్ధిదారులకు సమగ్ర అవగాహన కల్పించి సిద్ధం చేస్తున్నామని అన్నారు. పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి వేణుమనోహర్, ప్రత్యేక అధికారులు కొండపల్లి శ్రీరాం, పరంధామరెడ్డి, విజయ డెయిరీ డీడీ భారతలక్ష్మి, చింతకాని ఎంపీడీవో రవికుమార్, నాగిలిగొండ సర్పంచ్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. పశువైద్య అధికారులు డాక్టర్ పండరీబాబు, వైద్యులు రాజేశ్, స్వాతి, శ్రీహరి, వాంజే.. పాడి పరిశ్రమ పట్ల లబ్ధిదారులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, గ్రూప్ డిసషన్ ద్వారా సమగ్ర అవగాహన కల్పించారు.
వేసవిలో తాగునీటి ఎద్దడి ఉండొద్దు
మిషన్ భగీరథ కింద నగరంలో పురోగతిలో ఉన్న మంచి నీటి పథకాల పనులను త్వరగా పూర్తి చేసి వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. భగీరథ, గోళ్లపాడు చానల్, సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల పురోగతిపై డీపీఆర్సీ భవనంలో కేఎంసీ కమిషనర్‌తో కలిసి ఇంజినీరింగ్ అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
గిరిజనభవన్ అందుబాటులోకి తేవాలి
నగరంలో గిరిజనుల అవసరాల కోసం ప్రభుత్వం రూ.1.10 కోట్లతో చేపట్టిన గిరిజన సంక్షేమ భవన్ అందుబాటులోకి తేవాలని ఆ శాఖ ఇంజినీరింగ్ అధికారులను ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. భవనంలో జరుగుతున్న ముగింపు పనులను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిరిజన సంక్షేమ శాఖ డీడీ కృష్ణనాయక్, డీఈఈ రాజు, ఈఈ తానాజీ తదితరులు పాల్గొన్నారు.
బీసీ స్టడీ సర్కిల్లో వసతులు కల్పించాలి
జిల్లా యువతకు పోటీ పరీక్షల కోచింగ్‌ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మంలో నిర్మిస్తున్న బీసీ స్టడీ సర్కిల్ భవనంలో మౌలిక వసతుల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆర్ఎండ్బీ అధికారులు, కాంట్రాక్టర్లను ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్‌తో కలిసి బుధవారం ఆయా పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా బీసీ సంక్షేమాధికారి జ్యోతి, బీసీ సడీ సరిల్ డైరెక్టర్ శ్రీలత, ఆర్అండ్.బీ ఈఈ శ్యాంప్రసాద్, పీఆర్ డీఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.