కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై గిరిజనుల ఆగ్రహం
ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారంటూ మండిపాటు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు
బీజేపీ, కేంద్ర మంత్రి దిష్టిబొమ్మల దహనాలు
నమస్తే నెట్వర్క్; కేంద్రం తీరుపై టీఆర్ఎస్ నాయకులు, గిరిజనులు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపితే కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు తమకు రాలేదని పచ్చి అబద్ధం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ శవయాత్ర నిర్వహించి ప్రధాని, కేంద్ర మంత్రి దిష్టిబొమ్మలను దహనం చేశారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర మంత్రి మాటలు గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. గిరిజన జాతికి క్షమాపణ చెప్పేదాకా విడిచిపెట్టబోమని హెచ్చరించారు.
తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన ఎస్టీ రిజర్వేషన్ పెంపు బిల్లును ఆమోదించనందుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు బుధవారం బూర్గంపహాడ్‌లో దహనం చేశారు. పొడియం నరేందర్, జక్కం సుబ్రమణ్యం, లకావత్ వెంకటేశ్వర్లు, కొనకంచి శ్రీనివాస్, తుపాకుల రవి తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం, మార్చి 23: స్థానిక లక్ష్మీనగరం ప్రధాన సెంటర్లో మోదీ దిష్టిబొమ్మను ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు బుధవారం దహనం చేశారు. తెల్లం సీతమ్మ, రేసు లక్ష్మి, కణితి రాముడు, జానీపాషా, తునికి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం, మార్చి 23: స్థానిక అంబేద్కర్ సెంటర్లో మోదీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో నాయకులు బుధవారం దహనం చేశారు. కార్యక్రమంలో అరికెల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, రత్నం రమాకాంత్, చింతాడి చిట్టిబాబు, బల్లా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.