క్షయ నియంత్రణలో రెండోసారి జాతీయస్థాయి అవార్డు
భద్రాద్రి జిల్లాలో 2,709 మంది వ్యాధిగ్రస్తుల గుర్తింపు
నేడు క్షయ (ట్యూబెర్క్యులోసిస్) నివారణ దినోత్సవం
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 23 (నమస్తే తెలంగాణ): టీబీ (ట్యూబెర్క్యులోసిస్) అంటేనే ఆ రోగి దగ్గర ఎవరూ ఉండరు. అలాంటి మొండి వ్యాధిని నియంత్రించడంలో భద్రాద్రి జిల్లా వైద్యశాఖ ప్రత్యేక చొరవ చూపింది. దీంతో మొదటి స్థానంలో నిలిచింది. వ్యాధి గ్రస్తులను గుర్తిస్తూ, సకాలంలో వారికి మందులు పంపిణీ చేస్తూ.. నియంత్రణలో మంచి పేరు తెచ్చుకుంది. దీంతో జిల్లా క్షయ నివారణ శాఖ జాతీయ స్థాయిలో రెండోసారి బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నది. గురువారం టీబీ డే సందర్భంగా ఢిల్లీలో సెంట్రల్ టీబీ డివిజన్.. భద్రాద్రి జిల్లాలో ఆ శాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీనివాస్‌కు అవార్డును బహూకరించనున్నది. భద్రాచలం కేంద్రంగా టీబీ ఆసుపత్రి అందుబాటులో ఉంది. కొత్తగూడెం, భద్రాచలంలో అధునాతన పరికరమైన సీబీనాట్ను అందుబాటులో ఉంచారు. గంటల వ్యవధిలో టీబీ పరీక్ష చేసి నిర్ధారణ చేసేందుకు ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏటా గిరిజన గ్రామాల్లో అవగాహన పెంచడం కోసం టీబీ మొబైల్ వాహనాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పది అంశాలతో పది బృందాలు సర్వే చేయగా భద్రాద్రితో పాటు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు ఈ అవార్డులు దక్కాయి.
రెండోసారి నేషనల్ అవార్డు..
క్షయ వ్యాధిని నియంత్రిస్తున్నందుకు, వ్యాధిగ్రస్తులను గుర్తించి సకాలంలో వారికి మందులు సరఫరా చేస్తున్నందుకు భద్రాద్రి జిల్లాకు జాతీయస్థాయి అవార్డు దక్కింది. నిరుడు కూడా బ్రాంజ్ మెడల్‌ను ఈ జిల్లా సొంతం చేసుకుంది. 92 శాతం రికవరీ రేటును సాధించింది.
కొత్త చికిత్సా విధానం..
ఎంతటి దగ్గుకైనా ఏడాదిలోపే చెక్ పెట్టేందుకు వైద్య ఆరోగ్యశాఖ కొత్త చికిత్సా విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ ) మందులతో జిల్లా వైద్యులు ఆరు నెలల్లోనే వ్యాధి తగ్గుముఖం పట్టిస్తున్నారు. అయినప్పటికీ ఒకరి నుంచి ఒకరికి సోకే ఈ వ్యాధి వల్ల వ్యాధిగ్రస్తులు వేర్వేరు ప్రాంతాల్లో పెరుగుతూనే ఉన్నారు. భద్రాద్రి జిల్లాలో 2,209 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు క్షయ వ్యాధి శాఖ సర్వే ద్వారా గుర్తించింది. ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా సుమారు మరో 500 మంది రోగులను గుర్తించారు. వారు మందులు కూడా వాడుతున్నారు. గతంలో రెండు మూడేళ్లు మందులు వాడితేగానీ తగ్గని దగ్గు.. నూతన చికిత్సా విధానం, మందులతో ఇప్పుడు ఏడాదిలోపే నయమవుతోంది. అయినప్పటికీ దగ్గును నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
మందులు వాడితే తగ్గిపోతుంది..
టీబీ అంటే ఎవరికైనా భయమే. సకాలంలో గుర్తించి మందులు వాడితే పూర్తిగా తగ్గిపోతుంది. పరీక్ష చేసిన గంటలోనే ఫలితాలు ఇచ్చే పరికరం ఉంది. గతంలో భద్రాచలంలో ఉండేది. ఇప్పుడు కొత్తగూడెంలోనూ అందుబాటులో ఉంది. బిడాక్విలిన్ అనే కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. ఎంతటి మొండి టీబీనైనా ఏడాదిలోపే అదుపులోకి తెస్తుంది. టీబీని నియంత్రించడంలో భద్రాద్రి జిల్లా ముందు వరసలో ఉంటోంది. దీంతో రెండోసారి జాతీయ స్థాయిలో అవార్డును సొంతం చేసుకున్నాం.
–డాక్టర్ గోల్ల శ్రీనివాస్, జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి