పోటీ పరీక్షల కోసం విద్యార్థులకు సమకూర్చిన కార్పొరేటర్ చంద్రకళ
నిరుద్యోగులకు అందజేసిన మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్
ఖమ్మం, మార్చి 23 : రూ.వేల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను ఉచితంగా అందించడం కార్పొరేటర్ గోళ్ల చంద్రకళావెంకట్ మంచి మనసుకు నిదర్శనమని కేఎంసీ మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. 25వ డివిజన్ గాంధీ పార్కు గ్రంథాలయంలో వివిధ ఉద్యోగాలు సాధించేందుకు చదువుకుంటున్న నిరుద్యోగులు, విద్యార్థులకు కార్పొరేటర్ గోళ్ల చంద్రకళ ఆధ్వర్యంలో వారి కుటుంబ పెద్ద గోళ్ల వీరయ్య జ్ఞాపకార్థం సుమారు రూ.25 వేల విలువైన పుస్తకాలను సమకూర్చగా మేయర్, సుడా చైర్మన్ కలిసి బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి 90 వేలకు పైగా ఉద్యోగాలను ప్రకటించారని, వాటిని సాధించుకునేందుకు నిరుద్యోగ యువత పట్టుదలతో చదువుకుంటున్నారని అన్నారు. వారి లక్ష్యాల సాధన కోసం రూ.వేల విలువైన పుస్తకాలను అందించడం గొప్ప విషయమని అన్నారు. టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మణ్‌గౌడ్ పాల్గొన్నారు.