ఖమ్మం సిటీ, మార్చి 23: జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాల.. కాయకల్ప రేసుకు మరోమారు సమాయత్తం అవుతున్నది. ఇప్పటికే రెండు దఫాలు జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న పెద్దాసుపత్రి.. ముచ్చటగా మూడోసారి అవార్డు గెల్చుకునేందుకు ముస్తాబైంది. దీనిలో భాగంగా బుధవారం కాయకల్ప రాష్ట్రస్థాయి బృందం దవాఖానలో పర్యటించింది. ఈ సందర్భంగా వారు అణువణువునా తనిఖీలు నిర్వహించారు. తొలుత ప్రధాన ఆసుపత్రిని, అన్ని విభాగాలను సందర్శించారు. క్యాజువాలిటీ, ఐసీయూ, బ్లడ్ బ్యాంక్, ట్రామాకేర్, కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, ల్యాబోరేటరీ, రేడియాలజీ విభాగాలు, ఓపీ సేవలను పరిశీలించారు. అనంతరం మాతా, శిశు సంరక్షణ కేంద్రానికి వెళ్లారు. అక్కడి కాన్పుల గది, పిల్లల చికిత్సా విభాగం, నవజాత శిశువు చికిత్సా కేంద్రం, పిల్లల పోషణ విభాగంతోపాటు ఆసుపత్రి వంటశాలను సందర్శించి ఒక్కో అంశానికి మార్కులు కేటాయించారు. అనంతరం దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, మిగతా యంత్రాంగంతో ప్రత్యేకంగా సమావేశమై రికార్డులను తనిఖీ చేశారు. పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ ఆసుపత్రి మెరుగైన పనితీరు కనిపిస్తున్నదని బృందం సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్రం నుంచి డాక్టర్ బీ.శ్రీనివాసప్రసాద్, డాక్టర్ అరుణా సుమన్, రచన, రాధ, ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, అన్ని విభాగాల హెచ్వోడీలు, డాక్టర్లు, హెడ్ నర్సులు, పారా మెడికల్, శానిటేషన్ విభాగాల సిబ్భంది, డైటీషియన్ సూర్యపోగు మేరీ, క్యాలిటీ మేనేజర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఇటీవలే ఈ ఆసుపత్రిని అంతర్ జిల్లా ప్రతినిధుల బృందం తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.