ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
రూ.50.76 లక్షల చెక్కుల పంపిణీ
కల్లూరు, మార్చి 20 : వైద్యం చేయించుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందిపడే నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆర్థిక తోడ్పాటునందిస్తున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం కల్లూరు మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు అధ్యక్షతన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరిగింది. కల్లూరు మండలంలో 74, పెనుబల్లి మండలంలో 4 మొత్తం రూ.50,76,500 విలువైన 78 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం నుంచి సాయం అందిస్తున్నారని కేసీఆర్‌ను కొనియాడారు.
సీఐ కరుణాకర్‌కు ఘన సన్మానం
సత్తుపల్లి రూరల్ సీఐ కరుణాకర్ ఇటీవల బదిలీపై సత్తుపల్లి సీఐగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏసీపీ వెంకటేశ్‌తో కలిసి ఎమ్మెల్యే సన్మానించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో కరుణాకర్ సేవలు రూరల్ ప్రాంతంలోని ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని కొనియాడారు. సీఐ కరుణాకర్‌ను సర్పంచులు, ఎంపీటీసీలు, రేషన్‌డీలర్లు, ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించారు.
మల్లు స్వరాజ్యానికి ఘననివాళి
తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ నాయకురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల ఎమ్మెల్యే సండ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్‌బాబు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, కో-ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, జిల్లా, రైతుబంధు సమితి మండల సభ్యులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, పెనుబల్లి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.