మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
చుంచుపల్లిలో సీఎంఆర్ షాపింగ్‌మాల్ ప్రారంభం
చుంచుపల్లి, మార్చి 20: జిల్లా కేంద్రం కొత్తగూడెం సమీపాన ఉన్న చుంచుపల్లి మండల కేంద్రంలో సీఎంఆర్ షాపింగ్ మాల్, జ్యూవెలరీ విభాగాన్ని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు చేరువలో షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నాణ్యమైన దుస్తులు అందించి వారి మన్ననలు పొందాలని యాజమాన్యానికి సూచించారు. అన్నివర్గాల ప్రజలకు అనుకూలమైన ధరల్లో విక్రయాలు జరపాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీ బాదావత్ శాంతి పాల్గొన్నారు.
నేడు సినీ తారల రాక…
సీఎంఆర్ షాపింగ్ మాల్‌కు సోమవారం సినీతారలు రానున్నట్లు షాపింగ్ మాల్ సీఎండీ రమణ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రముఖ సినీ హీరో, హీరోయిన్లు సందర్శిస్తారని, రాష్ట్రవ్యాప్తంగా తమ సంస్థ 18వ షాపింగ్‌మాల్‌ను కొత్తగూడెంలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
మహిళల రక్షణే షీటీమ్స్ ధ్యేయం
మామిళ్లగూడెం, మార్చి 20 : మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా షీ టీమ్స్ పని చేస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మహిళల భద్రత, లింగ సమానత్వం గురించి అవగాహన కల్పించేందుకు ఖమ్మంలో షీ-టీమ్స్ 2కే, 5కే రన్ ప్రచార రథాన్ని ఆదివారం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. వీడీవోస్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సుస్థిరమైన రేపటి సమాజం కోసం ఈ రోజు లింగ సమానత్వం అనే థీమ్‌కు అనుగుణంగా ఖమ్మం పోలీస్‌శాఖ షీ-టీమ్ ఆధ్వర్యంలో జెండర్ ఈ క్వాలిటీ 2కే, 5కే రన్‌ను నిర్వహిస్తున్నారని, దీనిని విజయవంతం చేయాలని కోరారు. మార్చి 27వ తేదీన ఉదయం 6గంటలకు ఖమ్మం పటేల్ స్టేడియం నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు రన్ కొనసాగుతుందన్నారు. మహిళల రక్షణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు. మహిళల భద్రత, లింగ సమానత్వంపై అవగాహన ప్రచార పోస్టర్‌ను ఆవిషరించారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, ఏసీపీ ఆంజనేయులు, సీఐలు అంజలి, శ్రీధర్, సర్వయ్య, చిట్టిబాబు, విజయ్, రఘునాథపాలెం ప్రియాంక, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, కార్పొరేటర్లు, గో రూరల్ ఇండియా సంస్థ ప్రతినిధి సునీల్, టీఆర్ఎస్ నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు పాల్గొన్నారు.