ఖమ్మం, మార్చి 19: ఖమ్మం ఐటీ హబ్ ద్వారా వేల మంది నిరుద్యోగులు సాంకేతిక రంగంలో ఉద్యోగాలు అందిపుచ్చుకోవడం శుభపరిణామమని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఐటీ హబ్‌లో ఉన్న వివిధ సంస్థలు తమ సేవలను మరింత విస్తరించాలని, జిల్లా యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు. ఖమ్మం ఐటీ హబ్ నుంచి సాంకేతిక సేవలు కొనసాగిస్తున్న సోవార్జిన్ ఐటీ సొల్యూషన్స్ సంస్థ తమ సేవల విస్తరణలో భాగంగా ఖమ్మం జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ మేరకు సంస్థ మరో 21 మందికి అవకాశం కల్పించింది. ఇందులో ఎంపికైన నిరుద్యోగులకు శనివారం ఉద్యోగ నియామక పత్రాలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అందజేశారు. నగరంలోని ఐటీ హబ్‌లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సోవార్జిన్ ఐటీ సొల్యూషన్స్ సీఈవో ప్రణీత్, సీఎండీలు బత్తినేని నాగప్రసాదరావు, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి మెప్మా సిబ్బంది కృజ్ఞతలు
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకూ వేతనాలు చెల్లిస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించడంపై మెప్మా సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఖమ్మంలో మంత్రి అజయ్‌కుమార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.