భద్రాద్రి, పర్ణశాలకు భారీగా వచ్చిన భక్తులు
బేడా మండపంలో ప్రత్యేక పూజలు
తలంబ్రాలు కలిపిన మహిళలు
భద్రాచలం/ పర్ణశాల, మార్చి 18: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో వసంతోత్సవం, డోలోత్సవం కార్యక్రమాలు శుక్రవారం నేత్రపర్వంగా జరిగాయి. ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున స్వామివారికి ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఉత్సవమూర్తులను బేడా మండపంలో ఉంచి వెండి కలశాలతో అభిషేకం తిరుమంజనం జరిపారు. అనంతరం స్వామివారిని ఊయలలో ఉంచి డోలోత్సవం జరిపారు. ‘మాణిక్యం గట్టి’ అనే ద్రవిడ పాశురాన్ని ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి పఠించగా.. అర్చక స్వాములు వసంతున్ని ఆవాహన చేశారు. ఈ కార్యక్రమంతో రామయ్యను పెళ్లి కుమారుడిగా, సీతమ్మను పెళ్లి కుమార్తెగా భావిస్తామని అర్చకులు వివరించారు.
తలంబ్రాలు కలిపే వేడుక..
చిత్రకూట మండపంలో నవమి తలంబ్రాలను కలిపే వేడుకను కనుల పండువగా నిర్వహించారు. ముందుగా ఆలయ ఈవో శివాజీ దంపతులు అంతరాలయం నుంచి స్వామివారి శేష మాలికలను, కల్యాణ సామగ్రిని సమస్త మంగళవాయిద్యాల నడుమ తోడ్కొని వచ్చారు. ఆలయ ప్రధానార్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం జరిపి.. ఆ పుణ్య జలాలను తలంబ్రాల కోసం తీసుకుని వచ్చిన బియ్యంపై ప్రోక్షించారు. రోలు, రోకలిలో లక్ష్మి, సరస్వతి అమ్మవార్లను ఆవాహన చేసి రోకలికి కంకణధారణ చేశారు. ఆ తరువాత తొమ్మిదిమంది వైష్ణవ ముత్తైదువులతో పసుపు కొమ్ములను దంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తొమ్మిది రకాల ద్రవ్యాలతో 1,108 మంది మహిళలు తలంబ్రాలను కలిపారు. గోటితో ఒలిచిన తలంబ్రాలను స్వామివారికి సమర్పించేందుకు వివిధ ప్రాంతాల భక్తులు పాదయాత్రగా వచ్చారు. అర్చకులు ఈ తలంబ్రాలను శిరస్సుపై ధరించి మూలమూర్తుల వద్దకు తీసుకెళ్లారు.
స్వర్ణలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని బేడా మండపంలో స్వర్ణలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఏటా ఫాల్గుణోత్తర పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం 4:30 గంటలకు సామూహిక శ్రీలక్ష్మి పూజలు నిర్వహించడం ఆనవాయితీ.
పర్ణశాలలో..
పవిత్ర పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో డోలా పౌర్ణమి సందర్భంగా పర్ణశాల రామయ్య పెండ్లికుమారుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత ముత్తైదువులతో పసుపుకొమ్ములు కొట్టించే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మహిళలు మూలమూర్తులకు స్నానం చేయించేందుకు బిందెలతో పవిత్ర గోదావరి నీటిని తెచ్చి తంతు నిర్వహించారు. అందులో భాగంగా ఉత్సవమూర్తులకు వసంతోత్సవం నిర్వహించారు. రామయ్యను పెండ్లికుమారుడిని చేసే కార్యంలో భాగంగా అర్చకులు విశ్వక్సేన పూజ, రక్షాబంధనాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు.