ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో వేడుకలు
రంగులు చల్లుకుంటూ కేరింతలతో సందడి
ఖమ్మం కల్చరల్, మార్చి 18 : ఉమ్మడి జిల్లా.. సప్తవర్ణశోభితమైంది. నింగిని వదిలిన వేనవేల ఇంద్రధనుస్సులు నేలను తాకాయి. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి శుక్రవారం హోలీ పండుగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వారు రంగుల పండుగను జరుపుకున్నారు. వాడవాడలూ రంగులమయమై నేత్రపర్వం చేశాయి. కేరింతలు, నృత్యాలతో చిన్నారులు, యువతీ యువకులు హోరెత్తించారు. ఫాల్గుణ పౌర్ణమి, కాముడి పున్నమి, వసంతోత్సవం, హోలికా పూర్ణిమగా పిలుచుకునే ఈ రోజున భక్తులు ఆలయాలకు వెళ్లి తమ ఇష్ట దైవాలను దర్శించుకుని పూజలు చేశారు. రసాయన రంగులు కాకుండా సహజ రంగులనే అధికంగా ఉపయోగించడం విశేషం.
రంగ్ డోల్ బాజే..
ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో హోలీ సంబురాలు ఘనంగా నిర్వహించారు. సీపీ విష్ణు ఎస్ వారియర్ ఆధ్వర్యంలో వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. సీపీ విష్ణు, ఇతర పోలీస్ అధికారులు పోలీస్ బ్యాండ్‌ను మోగిస్తూ, రంగులు చల్లుకుంటూ, స్టెప్పులు వేస్తూ సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. హోలీ వేడుకలు మానవ, కుటుంబ సంబంధాలను మరింత పెంచుతాయని అన్నారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్లు పరస్పరం రంగులు చల్లుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఏడీసీపీలు గౌస్ అలం, సుభాశ్ చంద్రబోస్, కుమారస్వామి, ఏసీపీలు బస్వారెడ్డి, ప్రసన్నకుమార్, రామాంజనేయులు, విజయబాబు, ఆర్ఐలు రవి, శ్రీనివాస్, సాంబశివరావు, శ్రీశైలం, సీఐలు చిట్టిబాబు, శ్రీధర్, సర్వయ్య, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా మోదుగు పూల సహజ రంగులతో ఖమ్మం మార్కెట్ కమిటీ ఏఎంసీ చైర్పర్సన్ డౌలే లక్ష్మీప్రసన్న సాయికుమార్, ఇతర నాయకులు హోలీ సంబురాలను నిర్వహించారు